రాష్ట్రంలో రూ.16,400 కోట్లతో 5 సోలార్ పార్కులు

సోలార్ పార్కుల అభివృద్ధి పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు 4100 మెగావాట్ల సామర్థ్యంతో 5 సోలార్ పార్కులు మంజూరు చేసినట్లు కేంద్ర పునరుత్పాదక శక్తి, విద్యుత్ శాఖల మంత్రి ఆర్ కే సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ అనంతపురంలో రెండు, కర్నూలు, వైఎస్సార్‌ కడప జిల్లాలో ఒక్కో సోలార్ పార్కు, రామగిరిలో సోలార్ విండ్ హైబ్రీడ్ పార్కుల అభివృద్ధికి కేంద్ర ప్రభత్వ ఆర్థిక సహాయం కింద 590.80 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అనంతపురంలో 1400 మెగావాట్ల సోలార్ పార్కు-1కు 244.81 కోట్లు, 500 మెగావాట్ల పార్కు-2కు 91.24 కోట్లు, వైఎస్సార్‌ కడప జిల్లాలోని 1000 మెగావాట్ల సోలార్ పార్కుకు 54.25 కోట్లు, కర్నూలులో 1000 మెగావాట్ల పార్కుకు 200.25 కోట్లు చొప్పున ఆర్థిక సహాయాన్ని విడుదల చేసినట్లు తెలిపారు.

అనంతపురంలో 1400 మెగావాట్ల సోలార్ పార్కు-1, కర్నూలులో 1000 మెగావాట్ల సోలార్ పార్కు స్థాపిత సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. వైఎస్సార్‌ కడప జిల్లాలో 1000 మెగావాట్ల సామర్థ్యానికి గాను 250 మెగావాట్లు, అనంతపురంలోని రెండవ సోలార్ పార్కు 500 మెగావాట్ల సామర్థ్యానికిగాను 400 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తున్నట్లు మంత్రి తెలిపారు. రామగిరిలో 200 మెగావాట్ల సామర్థ్యంతో ఆమోదం పొందిన సోలార్ విండ్ హైబ్రిడ్ పార్కును ప్రారంభించాల్సి ఉందని అన్నారు.

సోలార్ పార్కులో ఒక మెగావాట్ విద్యుత్‌ సామర్థ్యం నెలకొల్పేందుకు సరాసరి 4 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ మేరకు మొత్తం 4100 మెగావాట్ల సామర్థ్యంగల 5 పార్కులకు సుమారు 16400 కోట్లు వ్యయం అవుతుందని మంత్రి అన్నారు. డీపీఆర్ తయారు చేసేందుకు ఒక్కో సోలార్ పార్కుకు 25 లక్షలు, అదనంగా ఒక్కో మెగావాట్ స్థాపనకు 20 లక్షలు లేదా 30% నిధులు కేంద్రం చెల్లిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సోలార్ పార్కులు పూర్తి చేసేందుకు ఈ పథకాన్ని 2024 మార్చి వరకు పొడిగించినట్లు మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

%d bloggers like this: