కూతురు వయసున్న ఓ అమ్మాయిని.. 65 ఏండ్ల వ్యక్తి వివాహమాడాడు. ఇది ఆయనకు రెండో పెళ్లి. ఆశ్చర్యకరం ఏంటంటే.. తన ఆరుగురు కుమార్తెలు దగ్గరుండి తండ్రికి వివాహం జరిపించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ అయోధ్య పరిధిలోని మవాయి బ్లాక్‌కు చెందిన నక్కద్ యాదవ్(65)కు కొన్నేండ్ల క్రితం వివాహమైంది. యాదవ్‌కు ఆరుగురు కుమార్తెలు. వారందరికి వివాహాలు అయ్యాయి. ఆయన భార్య అనారోగ్యంతో కొన్నేండ్ల క్రితం చనిపోయింది.
ఇక ఒంటరిగా ఉంటున్న యాదవ్‌కు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఇదే విషయాన్ని తన బిడ్డలకు, బంధువులకు తెలియజెప్పాడు. వారు కూడా అంగీకారం తెలుపడంతో.. 23 ఏండ్ల యువతిని స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో ఆదివారం పెళ్లి చేసుకున్నాడు యాదవ్.
ఈ సందర్భంగా యాదవ్ మాట్లాడుతూ.. తన ఆరుగురు కుమార్తెలు వారి భర్తలు, పిల్లలు, అల్లుళ్లు, కోడళ్లతో సంతోషంగా జీవిస్తున్నారు. తాను ఒంటరిగా ఉన్నానని, తోడు కావాలని చెప్పినప్పుడు.. వారు పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. తన రెండో పెళ్లికి తన బిడ్డలు, బంధువులు హాజరయ్యారు అని తెలిపాడు.