న‌వ్వినా, ద‌గ్గినా, తుమ్మినా దారాలంగా మూత్రం

న‌వ్వినా, ద‌గ్గినా, తుమ్మినా కాసేపు వ్యాయామం చేస్తున్నా.. ఉన్న‌ట్టుండి నియంత్ర‌ణ లేకుండా మూత్ర‌విస‌ర్జ‌న కావ‌డం అనేది కొంద‌రు మ‌హిళ‌ల్లో కనిపించే స‌మ‌స్య‌. దీన్నే వైద్య ప‌రిభాష‌లో స్ట్రెస్ యూరిన‌రీ ఇన్‌కాంటినెన్స్ (ఎస్‌యూఐ) అంటారు. నాలుగేళ్లుగా ఇలాంటి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న 40 ఏళ్ల మ‌హిళ‌కు అనంత‌పురంలోని కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రి వైద్యులు విజ‌య‌వంతంగా శ‌స్త్రచికిత్స చేసి, ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు. సాధార‌ణంగా హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు లాంటి పెద్ద న‌గ‌రాల్లో అత్యంత సీనియ‌ర్ యూరాల‌జిస్టులు మాత్ర‌మే చేసే ఇలాంటి శ‌స్త్రచికిత్స‌ల‌ను ఇప్పుడు రాయ‌లసీమ‌లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రికి చెందిన కన్స‌ల్టెంట్ యూరాల‌జిస్టు డాక్ట‌ర్ న‌రేంద్ర‌నాథ్ లోకారే తెలిపారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రాంతానికి చెందిన ‘‘40 ఏళ్ల మ‌హిళ నాలుగేళ్లుగా ఎస్‌యూఐతో బాధ‌ప‌డుతున్నారు. ఆమెకు 15 సంవ‌త్స‌రాల క్రిత‌మే గ‌ర్భ‌సంచి తొల‌గించారు (హిస్ట‌రెక్ట‌మీ). అయితే, ఆమెకు దిగువ మూత్ర‌నాళ స‌మ‌స్య‌కు సంబంధించిన ల‌క్ష‌ణాలేవీ లేవు. ఇంత‌కుముందు ఆమె ప‌లువురు యూరాల‌జిస్టుల‌ను క‌ల‌వ‌గా, వారంతా సంప్ర‌దాయ చికిత్స చేశారు గానీ, దానివ‌ల్ల ఫ‌లితం రాలేదు. దాంతో ఇటీవల ఆమె కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రికి వ‌చ్చారు. ఆమెకు అన్నిర‌కాల క్లినిక‌ల్‌, సిస్టోస్కొపిక్ ప‌రీక్ష‌లు చేయ‌గా, ఎస్‌యూఐ స‌మ‌స్య ఉన్న‌ట్లు గుర్తించాం.
దాంతో ఆమెకు సింథ‌టిక్ మెష్ ఉప‌యోగించి మిడ్ యూరెత్ర‌ల్ స్లింగ్ రిపేర్ చేయాల‌ని నిర్ణ‌యించాం. ఇటీవ‌లే ఆమెకు టీఓటీ రిపేర్ విజ‌య‌వంతంగా చేశాం. రాయ‌ల‌సీమ‌లోని ఈ ప్రాంతంలో ఈ త‌ర‌హా ఆప‌రేష‌న్ చేయ‌డం ఇదే మొద‌టిసారి. శ‌స్త్రచికిత్స అయిన ఒక రోజు త‌ర్వాతే ఆమెకు ఫోలీస్ కేథ‌ట‌ర్ తీసేశాం. త‌ర్వాత కూడా రోగి బాగానే ఉన్నారు. ఆప‌రేష‌న్ త‌ర్వాత ఆమెకు నియంత్ర‌ణ లేకుండా మూత్ర‌విస‌ర్జ‌న అన్న స‌మ‌స్య ఇక లేదు. దాంతో రెండోరోజు ఆమెను ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి చేశాం’’ అని ఆయ‌న వివ‌రించారు.

ఇక స‌మ‌స్య గురించి డాక్ట‌ర్ న‌రేంద్ర‌నాథ్ వివ‌రిస్తూ, ‘‘సాధార‌ణంగా ఎవ‌రైనా న‌వ్వినా, ద‌గ్గినా, తుమ్మినా, వ్యాయామాలు చేస్తున్నా శారీర‌క కార్య‌క‌లాపాలు పెరిగిన‌ప్పుడు ఉద‌ర‌భాగం మీద ఒత్తిడి ఎక్కువ‌వుతుంది. అలాంటి సంద‌ర్భంలో నియంత్ర‌ణ లేకుండా మూత్ర విస‌ర్జ‌న కావ‌డాన్నే స్ట్రెస్ యూరిన‌రీ ఇన్‌కాంటినెన్స్ (ఎస్‌యూఐ) అంటాం. మ‌హిళ‌ల్లో ఇది ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. మూత్ర మార్గం, బ్లాడ‌ర్ల‌కు అండ‌గా ఉండే గ‌ర్భాశ‌య ముఖ‌ద్వార క‌ణ‌జాలాలు, కండ‌రాలు బ‌ల‌హీన‌ప‌డిన‌ప్పుడు ఇది వ‌స్తుంది. అలాంటప్పుడు ఏదైనా శారీర‌క కార్య‌క‌లాపాలు చేస్తే బ్లాడ‌ర్ నెక్ కింద‌కు జారుతుంది. దానివ‌ల్ల మూత్ర‌మార్గం స‌రిగా ప‌నిచేయ‌దు. అది మూత్ర‌విస‌ర్జ‌న‌ను నియంత్రించ‌లేదు. మూత్ర‌మార్గాన్ని నియంత్రించే సంకోచ కండ‌రం బ‌ల‌హీన‌ప‌డిన‌ప్పుడు కూడా ఎస్‌యూఐ వ‌స్తుంది. సంకోచ‌కండ‌రం బ‌ల‌హీనం అయిన‌ప్పుడు మూత్ర ప్ర‌వాహాన్ని అది ఆప‌లేదు. గ‌ర్భం దాల్చ‌డం, పిల్ల‌ల్ని క‌న‌డం, వ‌య‌సు మీద‌ప‌డ‌టం, లేదా ఇంత‌కుముందు గ‌ర్భాశ‌యానికి ఏదైనా శ‌స్త్రచికిత్స జ‌ర‌గ‌డం వ‌ల్ల కండ‌రం బ‌ల‌హీన‌ప‌డుతుంది. దీర్ఘ‌కాలం పాటు ఆగ‌ని ద‌గ్గు, ఊబ‌కాయం, ధూమ‌పానం వ‌ల్ల కూడా ఎస్‌యూఐ రావ‌చ్చు’’ అని తెలిపారు.

Leave a Reply

%d