క‌ళ్లు తిరుగుతున్నాయ‌ని వెళ్తే… బ‌య‌ట‌ప‌డిన క్యాన్సర్!

క‌ళ్లు తిర‌గ‌డం, రెండువైపులా ఇద్ద‌రు ప‌ట్టుకుంటే త‌ప్ప న‌డ‌వ‌లేక‌పోవ‌డం, మాట త‌డ‌బాటు లాంటి స‌మ‌స్య‌ల‌తో వ‌చ్చిన ఓ మ‌హిళ‌కు నిశితంగా ప‌లు ర‌కాల వైద్య ప‌రీక్ష‌లు చేస్తే.. ఆ ల‌క్ష‌ణాల‌తో ఏ సంబంధం లేకుండా రొమ్ము కేన్స‌ర్ వ‌చ్చిన‌ట్లు తేలింది!! యాంటీబాడీ ప‌రీక్ష‌ల‌తో కేన్స‌ర్‌ను గుర్తించ‌డం అత్యంత అరుదు. ఇలాంటి సంఘ‌ట‌న క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రిలో ఇటీవ‌ల జ‌రిగింది. క‌ర్నూలు న‌గ‌రానికి చెందిన జయమ్మ (62) మ‌హిళ న‌డ‌క‌లో స‌మ‌స్య‌లు, క‌ళ్లు తిర‌గ‌డం, మాట త‌డ‌బ‌డ‌టం లాంటి ఇబ్బందులు ఉండ‌టంతో క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రికి వ‌చ్చారు. ఆమెను ఆస్ప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ న్యూరాల‌జిస్టు డాక్ట‌ర్ నిషాంత్ రెడ్డి ప‌రీక్షించారు. ఈ కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆయ‌న తెలిపారు.

‘‘ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి మెద‌డుకు సంబంధించిన స‌మ‌స్య అయి ఉంటుంద‌ని ఎంఆర్ఐ, సిటిస్కాన్ లాంటి పరీక్ష‌లు చేయ‌గా.. అందులో ఎలాంటి ఇబ్బంది లేద‌ని తేలింది. దాంతో అప్పుడు పార్నియోప్లాస్టిక్ ప్రొఫైల్ అనే ప‌రీక్ష చేయించాం. అందులో యాంటిరో యాంటీబాడీలు ప‌రీక్షించ‌గా అవి పాజిటివ్ అని వ‌చ్చింది. సాధార‌ణంగా శ‌రీరంలో ఎక్క‌డైనా కేన్స‌ర్ ప్రారంభ‌మైతే.. దాన్ని ఎదుర్కోడానికి మ‌న శ‌రీరంలోని రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ కొన్ని యాంటీబాడీల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. ఆ ర‌కం యాంటీబాడీలు శ‌రీరంలో ఉన్న‌ట్లు గుర్తించ‌గ‌లిగితే, కేన్స‌ర్ ఎక్క‌డో మొద‌లైంద‌ని అర్థం. ఈ కేసు విష‌యంలో యాంటీబాడీల‌ను గుర్తించ‌గానే.. కేన్స‌ర్ ఎక్క‌డుందో తెలుసుకోడానికి పెట్ సిటిస్కాన్ చేయించాం. అప్పుడు ఆమెకు రొమ్ము కేన్స‌ర్ మొద‌టిద‌శ‌లో ఉన్న‌ట్లు తేలింది. వెంట‌నే స‌ర్జిక‌ల్ ఆంకాల‌జిస్టుకు రిఫ‌ర్ చేయ‌గా, శ‌స్త్రచికిత్స చేశారు. తీసిన భాగాన్ని బ‌యాప్సీకి పంప‌గా, ఆమెకు కేన్స‌ర్ మొద‌టిద‌శ‌లో ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. దానికి ఇప్పుడు ఆమె కీమోథెర‌పీ చికిత్స తీసుకుంటున్నారు. ఆమెకు ఉన్న స‌మ‌స్య‌లు కూడా చాలావ‌ర‌కు త‌గ్గిపోయాయి. మాట దాదాపు సాధార‌ణంగా వ‌స్తోంది, బ‌య‌టకు వ‌స్తే ఒక‌రి సాయంతోనే న‌డుస్తున్నారు, ఇంట్లో అయితే గోడ ప‌ట్టుకుని సొంతంగా న‌డ‌వ‌గ‌లుగుతున్నారు. కేన్స‌ర్‌ను ఇలా యాంటీబాడీల‌తో గుర్తించ‌డం చాల అరుదు. సంవ‌త్స‌రం మొత్త‌మ్మీద ఒక‌టి లేదా రెండు కేసులు మాత్ర‌మే వ‌స్తాయి. ఈ కేసులో ఆమెకు న్యూరాల‌జీకి సంబంధించిన స‌మ‌స్య‌లు రావ‌డంతో మా వ‌ద్ద‌కు వ‌చ్చారు. కానీ ఆ స‌మ‌స్య కాక‌పోవ‌డంతో మూలం ఏంట‌ని మ‌రింత లోతుగా శోధించ‌డంతో అప్పుడు కేన్స‌ర్ బ‌య‌ట‌ప‌డింది. ఇప్పుడు దానికి పూర్తి చికిత్స తీసుకోవ‌డండ‌తో ఆమెకు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌లేదు’’ అని డాక్ట‌ర్ నిషాంత్ రెడ్డి వివ‌రించారు.

Leave a Reply

%d