ఏదైనా పండగో పబ్బమో వచ్చినప్పుడు కచ్చితంగా నాన్‌వెజ్ వండేస్తారు. ఇంకొంత మంది బలి ఇస్తామని దేవుణ్ని వేడుకుంటారు. ఆ కోరిక తీరిన తరవాత మొక్కు తీర్చుకుని అదే ప్రసాదం అని తినేస్తారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ వ్యక్తి ఇలానే బలి ఇచ్చాడు. కానీ..చివరకు తానే బలి అయ్యాడు. సూరజ్‌పూర్ జిల్లాలో 50 ఏళ్ల బగర్ సాయి తన కోరిక నెరవేరితే బలి ఇస్తానని దేవుడికి మొక్కుకున్నాడు. అది తీరగానే..అనుకున్నట్టుగానే మేకను బలి ఇచ్చాడు. ఆ తరవాత కుటుంబ సభ్యులతో కలిసి రుచికరంగా మటన్ వండుకున్నాడు. ఆ వేడి వేడి కూరను పళ్లెంలో వేసుకుని ఆస్వాదిస్తున్నాడు. కానీ..అదే తన చివరి భోజనం అవుతుందని ఊహించలేకపోయాడు. మటన్ ముక్కలు తింటుండగా అనుకోకుండా మేక కన్ను మింగేశాడు. అసలు కూరలో అలా కన్ను వస్తుందనే ఎవరూ ఊహించలేదు. మింగిన తరవాత వెంటనే బయటకు కక్కేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. గొంతులో ఇరుక్కోవడం వల్ల నరకయాతన అనుభవించాడు. ఊపిరి తీసుకోలేకపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. ఆ కన్ను గొంతుల్లో ఇరుక్కుపోయి శ్వాస ఆడక చనిపోయాడని వైద్యులు నిర్ధరించారు.