రాజీ పడ్డ తెలంగాణ సర్కార్

రాష్ట్ర ప్రభుత్వానికి షాక్‌ మీద షాక్‌ తగులుతోంది. ముఖ్యంగా రాజ్‌భవన్‌ విషయంలోనే దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి. మొన్న గణతంత్ర దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించాలని, పెరేడ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. దాంతో సర్కారు కొంత వెనక్కి తగ్గక తప్పలేదు. ఇప్పుడు తాజాగా గవర్నర్‌తో రాజీ పడేట్లు చేసి, అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించేట్లు చేసింది. గవర్నర్‌ తీరును ఎత్తి చూపాలని తలచిన ప్రభుత్వానికి ఇది ఊహించని పరిణామమే. చేసేది లేక గవర్నర్‌ ప్రసంగాన్ని ఉండేలా చూస్తామంటూ హైకోర్టుకు చెప్పాల్సి వచ్చింది. అసలు గవర్నర్‌పై లంచ్‌ మోషన్‌లో పిటిషన్‌ వేయడమే తప్పని నిపుణులు వివరిస్తున్నారు. ముందుగా పిటిషన్‌ వేయడమెందుకు, ఆనక నాలుక కరుచుకోవడమెందుకంటూ తప్పు పడుతున్నారు. రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) మధ్య గత కొంత కాలంగా భేదాభిప్రాయాలు నెలకొన్న విషయం తెలిసిందే. దాంతో గతేడాది మాదిరిగానే ప్రభుత్వం ఈసారి కూడా శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం లేకుండా చేసింది. శాసనసభ ఇంకా ప్రొరోగ్‌ కాలేదని, గత సమావేశాలకు కొనసాగింపుగానే ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహిస్తున్నామని, ఈ దృష్ట్యా గవర్నర్‌ ప్రసంగం అవసరం లేదంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతూ వచ్చాయి. ప్రారంభం రోజైన 3నే బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తలచింది. ఆ మేరకు 2023-24 బడ్జెట్‌ ముసాయిదాను ఈ నెల 21న గవర్నర్‌ అనుమతి కోసం పంపించింది. కానీ… గవర్నర్‌ ఈ అవకాశాన్ని వినియోగించుకుని, ఉభయ సభల నుద్దేశించి తాను చేయాల్సిన ప్రసంగం తాలూకు కాపీని పంపించాలని ఆదేశించింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో గవర్నర్‌ కూడా బడ్జెట్‌కు ఆమోదం తెలపలేదు. రాజ్యాంగంలోని 202 అధికరణ ప్రకారం శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు గవర్నర్‌ ఆమోదం పొందాలి. గవర్నర్‌ ఆమోదించక పోవడంతో ప్రభుత్వం సోమవారం లంచ్‌ మోషన్‌లో పిటిషన్‌ వేసింది. రాజ్‌భవన్‌, ప్రభుత్వ న్యాయవాదుల మధ్య చర్చ జరిగి, గవర్నర్‌ ప్రసంగం ఉండాలని నిర్ణయించారు. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి మరో షాక్‌ వంటిందని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం లేకుండా చేయాలనుకోవడం కరెక్ట్‌ కాదని చెబుతున్నారు. గవర్నర్‌ రాజ్యాంగబద్ధ పదవి అని, దానికి ప్రభుత్వం ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిందేనని, గవర్నర్‌ విషయంలో విధిగా ప్రొటోకాల్‌ పాటించాలని సూచిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంలో హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకున్న ప్రభుత్వం… అసెంబ్లీ సమావేశాల సందర్భంగానైనా కొంత తగ్గాల్సి ఉండిందని అభిప్రాయపడుతున్నారు.

 

Leave a Reply

%d bloggers like this: