మోచేతిలో కేన్సర్ రావడంతో దాదాపుగా చెయ్యి కోల్పోవాల్సి వచ్చిన ఓ యువకుడికి 3డి ప్రింటెడ్ ఎముకలను అమర్చి, చేతిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించడం ద్వారా అతడికి అమోర్ ఆస్పత్రి వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన అమోర్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ ఆర్థో ఆంకాలజిస్టు డాక్టర్ కిశోర్ బి.రెడ్డి ఈ కేసు వివరాలను, ఆ యువకుడికి చేసిన చికిత్స వివరాలను తెలిపారు.
‘‘సంగారెడ్డి ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువకుడికి మోచేతిలో బోన్ కేన్సర్ వచ్చింది. బయాప్సీ చేసి నిర్ధారించిన తర్వాత అతడికి ముందుగా కీమోథెరపీ చేసి తర్వాత శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాం. రేడియల్ ఎముక కూడా ప్రభావితం కావడంతో సమస్య ఎదురైంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో రెండే అవకాశాలుంటాయి. ఒకటి మోచెయ్యి నుంచి పూర్తిగా తొలగించడం, రెండోది కృత్రిమ ఎముక అమర్చడం. అలా అమర్చినా అది పెద్దగా పనిచేయదు. అందువల్ల చెయ్యి ఉండటానికి ఉంటుంది గానీ, కదలికలు సరిగా ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్ (పీఎస్ఐ) పెట్టడం ఒక్కటే సరైన మార్గం. గతంలో అయితే ఇలాంటి కృత్రిమ అవయవాలను జర్మనీ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అందుకు దాదాపు ఒకటి రెండు నెలల సమయం కూడా పట్టేది. కానీ ఇప్పుడు భారతదేశంలోనే రావడంతో పది రోజుల్లోనే శస్త్రచికిత్స చేయగలుగుతున్నాయి. అలా ప్రత్యేకంగా రోగి కొలతలతోనే వాళ్లకు సరిగ్గా సరిపోయే కృత్రిమ ఎముకలను అమర్చడం వల్ల చెయ్యి పూర్తిగా తిరిగొస్తుంది. ఇప్పుడు మేకిన్ ఇండియా పుణ్యమాని భారతదేశంలోనే ఇలాంటివి 3డి ప్రింటెడ్ ఎముకలు దొరుకుతున్నాయి.
దాంతో మేం ముందుగా ఆ యువకుడి చేతికి సీటీస్కాన్ తీసి బయోమెడికల్ ఇంజినీరుకు పంపించాం. వాళ్లు అక్కడ ఇతడి కొలతలకు తగినట్లుగా రేడియల్ ఎముక ప్లాస్టిక్ నమూనాను ముందుగా పంపారు. దాని డిజైన్ అంతా సరిపోయిందని మేము నిర్ధారించిన తర్వాత అప్పుడు 3డి ప్రింటెడ్ ఎముకను పంపారు. దాంతో శస్త్రచికిత్స చేయగా.. చెయ్యి పూర్తిగా తిరిగొచ్చింది. ఈ కేసులో రేడియల్ నరాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. అయినా మోచెయ్యి, మణికట్టు, చెయ్యి.. మొత్తం పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. ఆ చేత్తో అతడు ఇప్పుడు అన్ని రకాల పనులు చేసుకోగలుగుతున్నాడు. గతంలో అయితే ఇంత సాంకేతిక పరిజ్ఞానం మనకు అందుబాటులో లేకపోవడంతో రకరకాల సమస్యలు ఎదురయ్యేవి. భవిష్యత్తులో ఆర్థోపెడిక్ సమస్యలన్నింటికీ ఇలా 3డి ప్రింటెడ్ పరికరాలే వస్తాయి. ప్లేట్లు, స్క్రూలు.. అన్నీ రోగి కొలతలకు తగినట్లుగానే తయారుచేస్తారు. దానివల్ల అతి తక్కువ సమయంలోనే కోలుకోడానికి వీలుంటుంది’’ అని డాక్టర్ కిశోర్ బి. రెడ్డి వివరించారు.