గీతా బోధ ….అభినవ అర్జునులకు కర్తవ్య బోధ

నరుడి అభ్యున్నతికి నారాయణుడు బోధించిన జీవనసారం గీత. ఇక్కడ నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు. నరుడు.. ఆ రోజు ఒక్క అర్జునుడే! ఈ రోజు.. మనమంతా! మాయామోహితుడైన అర్జునుడిని ఉద్దరించడానికి ఉపదేశించింది మాత్రమే కాదు, ప్రతి మనిషినీ మహోన్నతుడిగా తీర్చిదిద్దడానికి శ్రీకృష్ణుడు పూరించిన శంఖారావం ఇది. అర్జునుడిని శిష్యుడిగా ఎంచుకొని తాను ఆచార్యుడిగా ప్రామాణిక మానసిక వికాస సూత్రాలను అందించాడు. సంగ్రామ సమయంలో ఆవిర్భవించిన భగవానుడి గీత..

ఈనాటికీ జీవన సంగ్రామంలో పోరాడుతున్న అభినవ అర్జునులకు కర్తవ్య బోధ.

శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం ఎందుకు చేశారు. రెండో అధ్యాయంలోనే స్పష్టం చేశాడు. ‘క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప’- క్షుద్రమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని వీడమని ఆదిలోనే హెచ్చరించాడు. ఈ హృదయమే అన్ని ఆలోచనలకూ, రాగద్వేషాలకు కేంద్రం. బుద్ధిస్థితిలో ఆలోచన ఉంటుంది. తర్కం పనిచేస్తుంది. హృదయం దగ్గరికి వచ్చేసరికి భావోద్వేగాలు, ఆశాపాశాలు, మాయామోహాలు అడుగు ముందుకు వేయకుండా కళ్లెం వేస్తాయి. అందుకే హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టమని చెప్పాడు కృష్ణుడు. ఆ తర్వాతే అసలు బోధ ప్రారంభించాడు.

గీతోపదేశంలో శ్రీకృష్ణుడు అస్త్రశస్త్రాల విశేషాల గురించి చెప్పలేదు. వాటిని ఎలా సంధించాలో వివరించలేదు. యుద్ధ వ్యూహాల చర్చను లేవనెత్తలేదు. శత్రువులను సంహరించే మెలకువలనూ నేర్పలేదు. ఈ విషయాలన్నిటిలో ఆరితేరిన సవ్యసాచి అర్జునుడు. మట్టిపట్టిన మాణిక్యాన్ని దులిపినట్టుగా, అర్జునుడిని ఆవహించిన మాయామోహాలను తన బోధతో తొలగించాడు.

నీ పని నువ్వే చెయ్యాలి అంటాడు గీతాచార్యుడు

ఎవరో వస్తారని, ఇంకెవరో ఉద్ధరిస్తారని కర్తవ్యాన్ని విస్మరిస్తుంటారు చాలామంది. చిన్నాచితకా పనుల కోసం కూడా ఇతరులపై ఆధారపడుతూ ఉంటారు. అలాంటి సోమరులు ఎందుకూ కొరగాకుండా పోతారన్నాడు గీతాచార్యుడు. ‘నీ పని నువ్వు చేయడమే
సరైనది’ అని సూచించాడు.

నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేదకర్మణః (3-8)

‘నీకు నిర్దేశించిన కర్మలను నువ్వు చేయడమే సరైనది. దేనినీ చేయకపోవడం కన్నా నీ ధర్మాన్ని అనుసరించి పని చేయడమే ఉత్తమం. ఏ పనీ చేయకుండా ఉంటే శరీర నిర్వహణ కూడా ముందుకు కొనసాగదు’ అన్నాడు శ్రీకృష్ణుడు. కర్మ అంటే వృత్తి ధర్మం. అంటే పనిచేయడం. నేటి పోటీ ప్రపంచంలో అనుక్షణం మేటి అని నిరూపించుకోవాల్సిందే! బాధ్యతలను సక్రమంగా నిర్వహించిన వారినే విజయం వరిస్తుంది.

తనను నమ్ముకున్న వాడిని ఉద్దరించడానికి ప్రేమతో భగవంతుడు కురిపించిన జ్ఞాన వర్షం భగవద్గీత. ఆ అమృతధారలలో మొట్టమొదట తడిసి ముద్దయినవాడు అర్జునుడు. మాయామోహాల చెర నుంచి బయటపడిన పార్థుడు మళ్లీ గాండీవం ధరించాడు. సమరంలో మెరిశాడు. సవ్యసాచి అన్న పేరును సార్థకం చేసుకున్నాడు. విజయుడై ఖ్యాతి గడించాడు.

భగవద్గీత అర్జునుడి ద్వారా సర్వజగత్తుకూ ఉపదేశించిన బ్రహ్మవిద్యాశాస్త్రం. గీత ప్రభవించిన మార్గశిర శుక్ల ఏకాదశి గీతా జయంతిగా నిర్వహించుకుంటున్నాం. భగవద్గీత పూజించడానికో, పఠించడానికో నిర్దేశించింది కాదు. గీతను పాటిస్తేనే జీవితానికి సమగ్రత చేకూరుతుంది. మనిషి సాటి మనిషిని అర్థం చేసుకోవడానికి, మనిషిగా బతకడానికి కావాల్సిన సూత్రాలన్నీ అందించిన గీతాచార్యుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం.

గీతోపదేశం అంతా అయిన తర్వాత ‘అర్జునా! పరమ రహస్యమైన జ్ఞానం బోధించాను. నిన్ను ఆవరించిన శోకం, మోహం తొలగిపోయిందా? ఈ జ్ఞానాన్ని సమగ్రంగా పరిశీలించి, నీకు ఇష్టమైన విధంగా ప్రవర్తించమ’ని చెప్పాడు. చెప్పడం వరకే ఆయన పని, చెప్పింది శ్రద్ధగా విన్నాడు.

విన్నది అర్థం చేసుకున్నాడు, అర్థమైన దాన్ని అర్థవంతంగా ఆచరించి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు అర్జునుడు.

మీనాక్షి మధురవాణి

Leave a Reply

%d