కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ మొదలు పెట్టినప్పటి నుంచీ ఆయన చేసిన ప్రయత్నాలు నీరుగారిపోయాయన్న అభిప్రాయమే రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది. గతంలో సిఎం కేసీఆర్ పలు రాష్ట్రాలకు వెళ్లి మరీ కలిసిన సీఎంలను బీఆర్‍ఎస్ ఆవిర్భావ సభకు ఆహ్వానించలేదా..? ఆహ్వానించినా వారు రాలేదా..? అన్న ప్రశ్నలు బీఆర్‍ఎస్ వర్గాలలోనే వినిపిస్తున్నాయి. పలువురు సీఎంలతో చర్చించిన సీఎం కేసీఆర్ బీఆర్‍ఎస్ ఆవిర్భావ సభకు వారినెందుకు దూరం పెట్టారన్న చర్చ సామాన్య జనంతో పాటుగా రాజకీయ వర్గాలలో కూడా జోరుగా సాగుతోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఝార్ఖండ్ సిఎం హేమంత్ సోరేన్, బిహార్ సిఎం నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ సిఎం మమతాబెనర్జీతో పాటు ఎన్సీపి అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వీ యాదవ్‍లను కేసీఆర్ ఎందుకు ఆహ్వానించలేదు.. ఒక వేళ ఆహ్వానించినా వారు ఆ ఆహ్వానాన్ని మన్నించలేదా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఆదిలోనే వారితో సీఎం కేసీఆర్‍కు సయోధ్య కరువైందా…? లేక బీఆర్‍ఎస్‍తో వారు దూరంగా ఉండాలని భావిస్తున్నారా..? అన్న చర్చ ఇప్పుడు రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
బీఆర్‍ఎస్ ఆవిర్భావ సభకు వారెవరూ రాకపోవడం కేసీఆర్ తొలి అడుగులోనే జాతీయ రాజకీయాలలో తడబడ్డారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ‘మోడీ ఇంటికి.. మేం ఢిల్లీకి’ అని ఖమ్మం సభ వేదికగా గంభీరంగా ప్రకటించిన కేసీఆర్.. కేవలం ఈ సభకు వచ్చిన ముగ్గురు, నలుగురు నాయకులతో ఎర్రకోట మీద జెండా ఎగురవేయగలనని భావిస్తున్నారా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం సభకు వచ్చిన నాయకుల పార్టీలన్నీ కలిపినా కూడా పట్టుమని పాతిక లోక్‍సభ స్థానాలు లేవు. అటువంటిది.. ఈ మద్దతుతో కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేస్తానంటే నమ్మశక్యంగా లేదనీ, అతి విశ్వాసమో.. లేదా అతి అమాయకత్వమో తప్ప మరొకటి కాదనీ అంటున్నారు.
జాతీయ స్థాయిలో రాజకీయం చేద్దామని భావిస్తున్న సీఎం కేసీఆర్‍కు ప్రాంతీయ పార్టీల నుంచి ప్రతిబంధకాలు ఎదురౌతున్నాయన్న భావనా వ్యక్తమౌతోంది. ప్రతి రాష్ట్రంలోనూ బిఆర్‍ఎస్ శాఖలను ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ ఉద్దేశానికి ఆయా రాష్ట్రాల్లోని అధికార ప్రాంతీయ పార్టీల నాయకత్వం నుంచి విముఖత ఎదురౌతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో బీఆర్‍ఎస్ శాఖలను ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కు ఆయా రాష్ట్రాలలో ప్రతికూలతలే ఎదురౌతున్నాయనీ, అందుకే ఇప్పటి వరకూ ఏపీలో తప్ప మరే రాష్ట్రంలోనూ బీఆర్‍ఎస్ శాఖలు ఏర్పాటు కాలేదనీ విశ్లేషిస్తున్నారు.