ఈనాడు న్యూస్, న్యూఢిల్లీ: మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ వ్యాఖ్యానించి రెండేళ్ల జైలుశిక్ష పొందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ మెడపై అనర్హత కత్తి వేలాడుతోంది. ప్రస్తుతానికి కోర్టు 30 రోజుల బెయిల్ ఇచ్చినా తర్వాత ఆయనకు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాబోతున్నాయి. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత పడుతుంది. అంతేకాదు సూరత్ కోర్ట్ తీర్పు ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలు కూడా తీసుకోవచ్చు. రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించి వాయనాడ్‌లో మళ్లీ ఎన్నికలు జరిపించవచ్చు. పై కోర్టులు కనుక సూరత్ కోర్ట్ తీర్పును కొట్టేయకపోతే రాహుల్ ఎనిమిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. అయితే సూరత్ కోర్ట్ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
రాహుల్‌పై సూరత్ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై చట్ట ప్రకారం ముందుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మ్లలికార్జున ఖర్గే చెప్పారు. బీజేపీ ఇలా చేస్తుందని తాము ముందే ఊహించామన్నారు. రాహుల్ నోరు నొక్కడానికే ఇలా చేశారని విమర్శించారు.
అటు తన సోదరుడు భయపడే రకం కాదని, భయపడబోడని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ చెప్పారు. నిజం చెప్పడమే అలవాటని, నిజమే చెబుతామన్నారు. రాహుల్ నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా బీజేపీ రాహుల్ గొంతు నొక్కే యత్నం చేస్తోందని విమర్శించారు.
మరోవైపు పరువు నష్టం కేసులో తనకు రెండేళ్ల జైలు శిక్ష పడటంపై రాహుల్ స్పందించారు. సత్యమే తనకు గురువని చెప్పారు. తన ధర్మం సత్యం, అహింసలపై ఆధారపడిందన్నారు.
మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేసు పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ కోర్టు తీర్పును స్వాగతించారు. ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారం సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల బెయిల్ ఇచ్చింది.