నేడు తారక్ అంత్యక్రియలు

ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి తారకరత్న భౌతిక కాయానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, బ్రహ్మణి, వైస్సార్‌టీపీ ప్రెసిడెంట్‌ షర్మిల, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, సినీనటుడు అలీ, పలువురు రాజకీయ నేతలు నివాళి అర్పించారు.  సోమవారం మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడరు. తారకరత్న మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతిని, బాధను కలిగించిందని అన్నారు. ఆస్పత్రి నుంచి కోలుకుని వస్తారని ఆశించామని, 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి తమకు దూరమై కుటుంబానికి విషాదాన్ని మిగిల్చారని అన్నారు. ఆయన కుటుంబానికి అందరం అండగా ఉంటామని తెలిపారు. శనివారం రాత్రి బెంగళూరు నుంచి తారకరత్న పార్థివదేహాన్ని హైదరాబాద్‌ లోని నివాసానికి తెచ్చినప్పటి నుంచి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అక్కడే ఉన్నారు.   టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తనకు చెప్పాడని ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు.

సినిమా ఇండస్ట్రీలోని పెద్ద కుటుంబాల్లో ఒకటైన నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చినా.. పేరుకు హీరో అయినా తారకరత్న జీవితం సాఫీగా సాగలేదు. ఆయన ఎన్నో ఎత్తుపళ్లాలను తన 39 ఏళ్ల జీవితంలో చూసేశారు. ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లోనే అంటే 17 నుంచి 18 ఏళ్ల వయసులోనే హీరోగా ఆరంగేట్రం చేశారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడంతోనే ఒకేసారి 9 సినిమాలకు సైన్ చేసి రికార్డు సృష్టించారు. అయితే, ఈ తొమ్మిది సినిమాల్లో ఐదు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. 2022లో వచ్చిన తొలి సినిమా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ ఆడినా.. ఆ తరవాత సినిమాలు వరుసగా డిజాస్టర్లు కావడంతో తారకరత్న కెరీర్ నెమ్మదించింది.

2006 తర్వాత మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న తారకరత్న.. 2009లో ‘అమరావతి’ చిత్రంతో మళ్లీ సినీ జీవితాన్ని మొదలుపెట్టారు. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అమరావతి’ సినిమాలో ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రంలో నటనకు గానూ ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు అందుకున్నారు. హీరో చేసినప్పుడు రాని అవార్డు.. ఆయన విలన్‌గా చేసినప్పుడు రావడం విశేషం. ఆ తరవాత ‘జా చెయ్యి వేస్తే’ సినిమాలోనూ తారకరత్న విలన్‌గా నటించారు. మొత్తంగా ఒక వెబ్ సిరీస్, 23 సినిమాల్లో తారకరత్న నటించారు. ఒక సినిమా విడుదల కావాల్సి ఉంది.

కాగా, చెన్నైలో 1983 జనవరి 8వ తేదీన నందమూరి మోహనకృష్ణ, సీత దంపతులకు తారకరత్న జన్మించారు. మోహనకృష్ణ దంపతులకు తారకరత్న ఒక్కగానొక్క కొడుకు. ఎన్టీయార్‌ నిర్మించిన కొన్ని సినిమాలకు మోహనకృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. చెన్నైలో ఏడో తరగతి వరకు చదువుకున్న తారకరత్న ఆ తరవాత హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌లో హైస్కూల్‌ విద్యను అభ్యసించారు. గుంటూరు విజ్ఞాన్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేసి.. హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదివారు.

ఇక తారకరత్న పెళ్లి కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అలేఖ్యరెడ్డిని తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి తారకరత్న తల్లిదండ్రులకు గానీ, కుటుంబ సభ్యులకు గానీ ఇష్టం లేదు. దీనికి పలు కారణాలు ప్రచారంలో ఉన్నాయి. అలేఖ్య రెడ్డికి అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్నారని ఒకటి.. కులం వేరుకావడంతో పెళ్లికి అంగీకరించలేదనే కారణం మరొకటి అని చెబుతుంటారు. తారకరత్నకు అలేఖ్యరెడ్డి సినిమాల్లో పరిచయం అని అంటుంటారు.

2012లో ‘దయ’ సినిమా షూటింగ్ సమయంలో తారకరత్నకు అలేఖ్యరెడ్డి పరిచయమయ్యారట. ఆ తరవాత ‘నందీశ్వరుడు’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా అలేఖ్యరెడ్డి పనిచేశారు. ఈ సినిమా సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారట. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో 2012లోనే స్నేహితుల సాయంతో హైదరాబాద్ శివారు రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉన్న సంఘీ టెంపుల్‌లో తారకరత్న, అలేఖ్య రెడ్డి వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా హాజరుకాలేదు. అయితే, ఆ తరవాత తారకరత్న తల్లిదండ్రులు మనసు మార్చుకున్నారు. కొడుకు, కోడలిని ఆశీర్వదించారు. తారకరత్న, అలేఖ్య దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కవలలు సంతానం. కాగా, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అలేఖ్యరెడ్డి చాలా దగ్గర బంధువు

 

Leave a Reply

%d bloggers like this: