నటి ప్రగతి.. సినిమాల్లో ఎక్కువగా తల్లి పాత్రల్లో నటిస్తుంటారు. పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ జీవిస్తుంటారు. ఇప్పటికీ ఎన్నో సినిమాల్లో తల్లి పాత్రల్లో నటించి నటిగా మంచి మార్కులు సంపాదించుకున్నారనే చెప్పాలి. అయితే, ఈమె సినిమాల్లోనే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాల్లో సైతం తలుక్కున మెరిసిపోతుంటారు. డ్యాన్స్ చేస్తున్న వీడియోలు, వర్కౌట్ చేసే వీడియోలు ఇలా అనేక రకాల వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవు.
ఇదిలా ఉంటే, నటి ప్రగతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆమె జీవితంలో పడ్డ కష్టాలే కాకుండా మరికొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నేను పెళ్లికి ముందు చాలా కష్టాలు పడ్డాను. ఇంట్లో కూర్చుని తింటున్నావని మా అమ్మ నన్ను ఇష్టమొచ్చినట్లు తిట్టేది. అవన్నీ భరించలేక పిజ్జా షాపుల్లో పని చేశానంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇంతే కాకుండా చివరికి డబ్బు కోసం ఎస్టీడీ బూతుల్లో కూడా పని చేశానంటూ నటి ప్రగతి చెప్పుకొచ్చింది. నేను ఆ టైమ్ లో చాలా లావుగా ఉండేదాన్ని, దీంతో కొందరు ఓ యాడ్ చేయమని నన్ను అడిగారు.
ఆ తర్వాత మెల్ల మెల్లగా మోడలింగ్ చేస్తూ చివరికి సినిమాల్లోకి వచ్చాను. కానీ, సినిమాల్లో వచ్చిన అవకాశాలను నేను అస్సలు వినియోగించుకోలేకపోయానని ప్రగతి బాధపడ్డారు. ఇదిలా ఉంటే, సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఓ హీరోతో జరిగిన వివాదం వల్ల పూర్తిగా సినిమాలు చేయడం ఆపేసి 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత నా భర్తతో విభేదాల కారణంగా అతనికి విడాకులు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ఇక మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా రాలేదని నటి ప్రగతి తెలిపారు.