అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. లాస్ ఏంజెల్స్‌లో శనివారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. లాస్ ఏంజెల్స్ పరిధిలోని బెవర్లీ క్రెస్ట్‌లో ఈ ఘటన జరిగింది. జనసమూహంలో కలిసిపోయిన ఓ సాయుధుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఆగి ఉన్న ఓ వాహనంపై విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడడంతో అందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మరో నలుగురు గాయపడగా వారిని చికత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. శనివారం తెల్లవారుజామున 2.30 గంటల (అమెరికా కాలమానం ప్రకారం) ప్రాంతంలో ఈ కాల్పుల ఘటనపై తమకు సమాచారం అందిందని లాస్ ఏంజెల్స్ ఫైర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. లాస్ ఏంజెల్స్ పోలీస్ విభాగం అధికారి ఫ్రాంక్ ప్రెసియాడో మృతుల వివరాలను మీడియాకు తెలియజేశారు. ఇదిలాఉంటే. కాలిఫోర్నియా రాష్ట్రంలో కాల్పులు జరగడం ఈ నెలలో ఇది నాలుగోసారి. వారం రోజుల క్రితం మాన్టెరే పార్క్‌లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 11 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత హాఫ్‌మూన్ బేలో ఓ దుండగుడు ఏకంగా ఏడుగురిని కాల్చి చంపాడు.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి
