రెచ్చిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు

దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యుల ఎన్నిక రణరంగాన్ని తలపించింది. కమిటీ సభ్యుల ఎన్నికలో అభ్యర్థులు వేసిన ఒక ఓటు చెల్లలేదని మేయర్‌ ప్రకటించడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు భాజపా అంతరాయం కలిగించింది. ఈ క్రమంలో అధికార ఆమ్‌ఆద్మీపార్టీ కౌన్సిలర్లు, ప్రతిపక్ష భాజపా కౌన్సిలర్లు ఢీ అంటే ఢీ అన్నారు. పరస్పరం పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. జట్టు పట్టుకొని ఒకరినొకరు ఈడ్చుకున్నారు. చొక్కాలు చించుకుంటూ తీవ్ర గందరగోళం సృష్టించారు. అయినప్పటికీ చెల్లుబాటు కాని ఓటును పరిగణనలోకి తీసుకోకుండానే ఫలితాన్ని వెల్లడిస్తానని మేయర్‌ ప్రకటించారు.

కౌన్సిలర్ల పరస్పర దాడిలో చాలా మందికి గాయాలయ్యాయి. కొంతమంది బట్టలు చిరిగిపోయాయి. ఈ గొడవలో ఒక కౌన్సిలర్‌ మూర్చపోయి కిందపడిపోయారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ దిల్లీ (ఎంసీడీ) కార్యాలయంలో నిర్వహిస్తున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను భాజపా అడ్డుకోవడతో తొలుత అధికార ఆప్‌ కౌన్సిలర్లు టేబుళ్లు ఎక్కి ఆందోళన చేపట్టారు. దీంతో భాజపా కౌన్సిలర్లు కూడా ఆప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఓట్లను రీకౌంట్‌ చేయడానికి భాజపా కౌన్సిలర్లు ససేమిరా అన్నారు.

‘‘ఒకవైపు రీ కౌంట్‌కు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు రీకౌంట్‌ వద్దంటున్నారు. అందుకే నేను రీ కౌంట్‌ చేయడం లేదు. చెల్లని ఓటును మినహాయించి ఫలితాలను వెల్లడిస్తాను’’ అంటూ కొత్తగా ఎన్నికైన మేయర్ షెల్లీ ఒబేరాయ్‌ స్పష్టం చేశారు. ‘ఒక ఓటు చెల్లుబాటు కాదు’ అనే విషయాన్ని మేయర్‌ వెల్లడించగానే.. ప్రతిపక్ష భాజపా కౌన్సిలర్లు చిర్రెత్తిపోయారు. ‘మీకు మతి లేదా?’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ‘జై శ్రీరామ్‌’ అంటూ నినాదాలు అందుకున్నారు. మరోవైపు వారికి పోటీగా ఆప్‌ కౌన్సిలర్లు ‘ఆమ్‌ ఆద్మీపార్టీ జిందాబాద్‌.. అర్వింద్‌ కేజ్రీవాల్‌ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేశారు. ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేయనున్న స్టాండింగ్‌ కమిటీకి ఏడుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఆప్‌ నుంచి గెలుపొందిన మొత్తం 250 మంది కౌన్సిలర్లలో 242 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు.

Leave a Reply

%d