అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో వింత ఘటన చోటు చేసుకుంది. అధికార పార్టీ చెందిన ఎమ్మెల్యేలు విపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ సాక్షిగా దాడి చేశారు.

నిండు సభలో.. సభాపతి సాక్షిగా.. విపక్ష దళిత ఎమ్మెల్యేను దారుణంగా కొట్టారు. తెలుగుదేశం ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామిపై వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు దాడిచేశారు. చరిత్రలో ఎప్పుడూ జరగని ఈ ఘటనతో సభ మొత్తం నిర్ఘాంతపోయింది. ఏం జరుగుతుందోనని సభ్యులంతా తేరుకునేలోపే భౌతిక దాడి జరిగిపోయింది. ఊహించని పరిణామంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం సభను వాయిదా కూడా వేయకుండానే తన చాంబర్లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం, దాడుల ప్రయత్నాలతో సభ యుద్ధభూమిని తలపించింది. మాజీ మంత్రి, వైసీపీకి చెందిన వెలంపల్లి శ్రీనివాస్‌.. టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కొట్టేందుకు ప్రయత్నం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీయగా.. ఎమ్మెల్యే డోలాను మరోమారు కొట్టేందుకు సూళ్లూరుపేట వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య దూసుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది. వాస్తవానికి భౌతికదాడి తర్వాత మార్షల్స్‌ సభలోకి రావడం ఏమాత్రం ఆలస్యమైనా మరిన్ని తీవ్ర పరిణామాలు జరిగేవి. ఉమ్మడి రాష్ట్రం నుంచీ ఎప్పుడూ సభలో మాటలు దాటి చేతలకు వెళ్లిన దాఖలాలు లేవు. కానీ మొట్టమొదటిసారి అసెంబ్లీ గౌరవానికి మచ్చతెచ్చేలా అధికార పక్ష ఎమ్మెల్యేలు విపక్ష సభ్యుడిపై దాడి చేశారు.

జరిగింది ఇది..

సోమవారం ఉదయం 9.01 గంటలకు సభ మొదలైంది. వెంటనే జీవో నంబర్‌ వన్‌పై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. పోడియం వద్దకు వెళ్లి ‘ఏ-1 తెచ్చాడు నంబరు 1’ అనే ప్లకార్డులతో నినాదాలు చేశారు. స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయినా టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్లి, ఆయన స్థానానికి ఎడమవైపున నిల్చొని నినాదాలు చేశారు. ఈలోగా ప్రశ్నోత్తరాలు ఆపేసి.. టీడీపీ సభ్యుల తీరుపై మంత్రులు అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఆదిమూలపు సురేశ్‌, కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే డోలా సభాపతికి కుడివైపునకు వెళ్లి నినాదాలు చేశారు. ఆ సమయంలో ఆయన చేతిలోని ప్లకార్డును స్పీకర్‌కు అడ్డుపెట్టారు. దీంతో స్పీకర్‌ దానిని పక్కకు నెట్టేశారు. తనను నెడతారా అంటూ డోలా సభాపతితో వాగ్వాదానికి దిగారు. నోరు మూసుకుని వెళ్లాలంటూ తమ్మినేని సైగ చేశారు. ఇంతలో వైసీపీ చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా పోడియంపైకి వెళ్లి డోలాను చేయి పట్టుకుని లాగే ప్రయత్నం చేశారు. ఆయన విదిలించేశారు. ఎలీజా వెనుకే వేగంగా వెళ్లిన టీజేఆర్‌ సుధాకర్‌బాబు డోలాను బలంగా లాగిపడేశారు. నన్నే లాగుతావా అంటూ నిలదీయబోగా డోలాను సుధాకర్‌బాబు డొక్కలో గుద్దారు. బలంగా గుద్దడంతో ఒక్క ఉదుటున ఆయన పోడియం కుడివైపు నుంచి కిందకు దిగే దారిలోని బల్లకు గుద్దుకుని పడిపోయారు. సభ్యులు, అసెంబ్లీ సిబ్బంది నిర్ఘాంతపోయారు. టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు.. సుధాకర్‌బాబును కిందకు తీసుకొచ్చారు. ఘటనతో షాక్‌ అయిన స్పీకర్‌ సభను వాయిదా కూడా వేయకుండానే లేచి తన చాంబర్‌లోకి వెళ్లిపోయారు.

Leave a Reply

%d bloggers like this: