ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కడప జిల్లాకు చెందిన ఓ జంట హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో విగతజీవులై కనిపించారు. ఆ జంటలోని యువకుడు గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకోగా యువతి మంచంపై అచేతనంగా పడి ఉంది. యువతి ప్రాణం తీసిన తర్వాత ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సైఫాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. కడప జిల్లా ప్రొద్దుటూర్‌లోని పెద్దశెట్టిపల్లెకు చెందిన బరకం ప్రసన్నలక్ష్మి (27), కానెపల్లికి చెందిన హేమాంబదరెడ్డి (37) ఈ నెల 10న (శుక్రవారం) లక్డీకాపూల్‌లోని ఓ లాడ్జిలో దిగారు. సోమవారం రాత్రి చెకౌట్ సమయం దాటిన తర్వాత లాడ్జి సిబ్బంది వారున్న గదికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో రాత్రి 10 గంటల సమయంలో మారు తాళం చెవితో సిబ్బంది గదిని తెరవగా ఇద్దరూ లోపలే ఉన్నారు. సమయం ఇస్తే డబ్బు చెల్లిస్తానని హేమాంబదరెడ్డి చెప్పడంతో సిబ్బంది వెళ్లిపోయారు. రాత్రి 11 గంటల తర్వాత మరోసారి ఫోన్ చేసినా బదులు రాకపోవడంతో సిబ్బంది వదిలేశారు. మంగళవారం ఉదయం కూడా స్పందన లేకపోవడంతో సిబ్బంది మరోసారి గదిని తెరిచి చూడగా.. ఇద్దరూ చనిపోయి ఉన్నారు. ప్రసన్నలక్ష్మి మంచంపై పడి ఉండగా హేమాంబదరెడ్డి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి ఆధారాలు సేకరించారు. ప్రసన్న లక్ష్మీ మెడకు గాయాలు ఉండటంతో.. ఆమెను హత్య చేసిన తర్వాత హేమాంబద ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
ప్రేయసిని చంపి… ప్రేమికుడు చేసిన పని ఏంటంటే
