ఈటెలకు బీజేపీ ఇచ్చిన బంపర్ ఆఫర్ అదేనాా ?

పార్టీలో గందరగోళం.. అంతర్గత కలహాలు.. క్యాడర్ లో అయోమయం.. ఇవన్నీ ఒకనాడు తెలంగాణ కాంగ్రెస్ లోని పరిస్థితులు. అయితే.. ఇప్పుడివన్నీ తెలంగాణ బీజేపీలో కనిపిస్తున్నాయని రాజకీయ పండితుల నుంచి వినిపిస్తున్న మాట. ముఖ్యంగా ఈటల అంశం చుట్టూ నేతలు వర్గాలుగా విడిపోయారని అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చాక ఈటలకు భారీ ఆఫర్ ఇచ్చి రెడ్ కార్పెట్ పరిచింది బీజేపీ. చేరికల కమిటీకి కన్వీనర్ చేసింది. కానీ, రానురాను తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న భావనలో ఈటల ఉన్నారని ప్రచారం సాగింది. దీనికి తగ్గట్టే కొన్నాళ్లుగా ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో బీజేపీలో భారీ బ్లాస్ట్ జరగనుందని వార్తలు వచ్చాయి.

ఈటల రాజేందర్ ఉద్యమ నాయకుడు. పైగా బీసీ లీడర్. రాష్ట్రవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న నేత. దీన్ని క్యాష్ చేసుకోవాలని బీజేపీ భావించింది. అయితే.. తనకు ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం జరిగింది. హస్తం పార్టీ కూడా ఈటలకు భారీ ఆఫరే ఇచ్చిందని వార్తలు వచ్చాయి. దాంతో ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించి ఢిల్లీ పెద్దలు ఈటలకు కబురు పంపి మాట్లాడారు. ఆ సమయంలో రాష్ట్ర బీజేపీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులన్నీ ఆయన ఏకరువు పెట్టినట్టు చెబుతున్నారు. బీజేపీ పెద్దలతో ఎప్పుడైతే ఈటల భేటీ అయ్యారో అప్పటి నుంచి రాష్ట్ర బీజేపీలో భారీ మార్పులు తథ్యమని వార్తలు మరింత ఊపందుకున్నాయి.

ఈటలను కాంగ్రెస్ కు వెళ్లకుండా ఆపిన బీజేపీ పెద్దలు భారీ ఆఫర్ ఇచ్చినట్టు చెబుతున్నారు విశ్లేషకులు. అందుకే, ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారని.. రెండు, మూడు రోజుల నుంచి పార్టీ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నారని అంటున్నారు. ఇదే క్రమంలో పార్టీ వ్యవహారాలను ఢిల్లీ పెద్దలే భుజాన వేసుకున్నట్టు చెబుతున్నారు. సునీల్ బన్సల్ ను రంగంలోకి దింపి కార్యక్రమాలు కొనసాగించే నిర్ణయం తీసుకున్నట్టుగా వివరిస్తున్నారు. అయితే.. ఈటలకు ఢిల్లీ పెద్దలు ఇచ్చిన హామీ ఏంటనే చర్చ జోరుగా జరుగుతోంది. కచ్చితంగా సీఎం పోస్ట్ హామీ వచ్చింది కాబట్టే ఆయన యాక్టివ్ అయ్యారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

మరోవైపు, బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తామని చెబుతున్న బీజేపీ.. కర్ణాటక ఎన్నికల తర్వాత ఢీలా పడిందనే వాదన ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్ దూకుడు పెంచడంతో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దీంతో అధిష్టానం పార్టీ అధ్యక్షుడి మార్పుపై దృష్టి పెట్టిందని అంటున్నారు విశ్లేషకులు. రేపోమాపో కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేస్తారని చెబుతున్నారు. దీంతో ఈటలకు లైన్ క్లియర్ అవుతుందని.. బండి సంజయ్ కి కేబినెట్ విస్తరణలో ఛాన్స్ ఇచ్చి అన్నీ సెట్ రైట్ చేసే ఆలోచనలో ఉన్నారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

 

Leave a Reply

%d