గత తొమ్మిదేళ్లలో సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కేసీఆర్, కొత్త సచివాలయ నిర్మాణం నేపథ్యంలో ఇప్పుడైనా వస్తారని తాను భావిస్తున్నానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆదివారం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోను హైదరాబాద్ రాజధానిగా ఉందని, అప్పుడు ఎనిమిది కోట్ల మంది ప్రజలకు సరిపడా సచివాలయం ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సరిపడే విధంగా నాడు గొప్పగా సచివాలయం ఉండేదని, ఆనాటి నాయకుల ఆనవాళ్లు ఉండకూడదనే కొత్త సచివాలయాన్ని కట్టుకున్నారని కేసీఆర్ పైన విమర్శలు గుప్పించారు. ఆయన హుజురాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
చరిత్రలో తానే గొప్పవాడిగా నిలిచిపోవాలనే ఉద్దేశ్యంతో కొత్త సచివాలయాన్ని నిర్మించాడని చెప్పారు. సచివాలయాన్ని కట్టడానికి తాను వ్యతిరేకం కాదని, కానీ ఆయన ప్రతిష్ట కోసం, ఆయన పేరు కోసం దీనిని కట్టినట్లుగా భావిస్తున్నానని చెప్పారు. ఎన్నివేల కోట్లు ఖర్చు పెట్టారు, దాని వెనుక ఏమి ఉన్నదనే విషయం గురించి తాను మాట్లాడదల్చుకోలేదన్నారు. కానీ తన డిమాండ్ ఒక్కటేనని, గతంలో ఎప్పుడు సచివాలయానికి లేదా ఆఫీస్ కు రాని ముఖ్యమంత్రి, కనీసం ఇప్పుడు కొత్త సచివాలయం కట్టిన తర్వాత అయినా ఆయన వస్తాడని భావిస్తున్నానని చెప్పారు.