తెలంగాణలో రేవంత్ రెడ్డిని మాత్రమే బీఆర్ఎస్ ప్రత్యర్థిగా అనుకుంటోంది. అందుకే ఆయనే టార్గెట్ గా రాజకీయం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు ఆయనపై నమ్మకం తగ్గించేందుకు ప్రత్యేకమైన వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ అంశంపై మాట్లాడిన అంశంపై చంద్రబాబు, టీడీపీకి లింక్ పెట్టడం వ్యూహాత్మకమేనని భావిస్తున్నారు. చంద్రబాబు తెదేపా ప్రస్తావన తీసుకు రావడం ద్వారా బీఆర్ఎస్ ఆశించిన రాజకీయ ప్రయోజనం.. కేవలం రేవంత్ రెడ్డిపై హైకమాండ్ విశ్వాసం తగ్గించడమేనంటున్నారు. గతంలో శశిథరూర్ విషయంలో కూడా కాంగ్రెస్ మంచిదే.. కానీ రేవంత్ కరెక్ట్ కాదన్నట్లుగా నేరుగా రాహుల్ గాంధీని ట్యాగ్ చేసి ట్వీట్లు చేశారు కేటీఆర్.
కాంగ్రెస్ అగ్రనేతలు ఎప్పుడు హైదరాబాద్ లేదా తెలంగాణ పర్యటనకు వచ్చిన రేవంత్ రెడ్డి సరైనచాయిస్ కాదని చెప్పేందుకే కేటీఆర్ ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రియాంకా గాంధీ యువ సంఘర్షణ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న సమయంలో కేటీఆర్ మరోసారి అదే వాదన వినిపించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ బలిదేవత అన్న వ్యక్తికే పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారని … గాంధీ భవన్‌ను గాడ్సేకు అప్పగించి తన అంతానికి కాంగ్రెస్ వీలునామా రాసుకుందని అన్నారు. ఇది కాంగ్రెస్ అమాయకత్వమో, ఆత్మహత్యా సదృశ్యమో తేల్చుకోవాలని సలహా ఇచ్చారు. అంటే.. రేవంత్ రెడ్డిని తప్పించాలని కేటీఆర్ సలహా అని ప్రత్యేకంగా చెప్పాల్సి నపని లేదు. కేసీఆర్ మూడు రోజుల బర్త్ డే వేడుకలు నిర్వహించినప్పుడు రేవంత్ చేసిన విమర్శలైప రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ చావును కోరుకుంటున్నారని. ఇలాంటి వారితోనే కాంగ్రెస్ నడిపేది అన్నట్లుగా ట్వీట్ చేశారు.
నిజానికి బీఆర్ఎస్ పెద్దలు తమకు ఎదురు నిలుస్తున్న నేతలపై ఇలాంటి వ్యూహమే అమలు చేస్తున్నారు. బీజేపీ చీప్ గా బండి సంజయ్.. బీఆర్ఎస్ పెద్దలకు కంట్లో నలుసులా తయారయ్యారు. ఆయనపై చివరికి.. పేపర్ లీకేజీ కేసు కూడా పెట్టారు. ఎన్ని సార్లు అరెస్ట్ చేశారో లెక్క లేదు. చివరికి ఆయన వల్ల పార్టీకి నష్టం జరుగుతుందన్న అభిప్రాయాన్ని కల్పించారని… చివరికి బండి సంజయ్ ను తప్పించారని రాజకీయవర్గాలంటున్నాయి. ఇది బీజేపీకి సెట్ బ్యాక్‌గా మారింది. రేవంత్ విషయంలో మాత్రం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరి భాజపా హైకమాండ్ లా బీఆర్ఎస్ రాజకీయానికి కాంగ్రెస్ పడుతందా లేదా అన్నది ముందు ముందు చూడాల్సి ఉంది. రాజకీయం అంటే… ఎదురునిలబడి కొట్లాడటం కాదు… ఎదుటి సైన్యంలో కీలకమైన వ్యక్తుల్ని.. నేతల్ని.. వారితోనే అస్త్రసన్యాసం చేయించడం అనే వ్యూహం కూడా ఒకటి. ఇప్పుడు బీఆర్ఎస్, కేటీఆర్ అదే చేస్తున్నారని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.