కర్నాటకలో కారు-సారు… ఎందుకు పోవడం లేదు ?

భారస ఇది జాతీయ పార్టీ. దేశాన్ని మార్చాల్సిన అవసరం ఉంది కాబట్టి పెట్టిన పార్టీ. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వెళ్లి… అక్కడి సమస్యల మీద పోరాడి… దేశానికి ప్రధాన మంత్రి కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ పార్టీ పేరు మార్చినప్పుడు చెప్పిన మాటలివి. అయితే తెలంగాణ పొరుగు రాష్ట్రం కర్నాటకలో ఎన్నికలు జరుగుతుంటే… అటు పక్కన చూసిన పాపాన పోవడం లేదు సీఎం కేసీఆర్… పోటీ చేయడం దేవుడెరుగు… కనీసం ఆ ఎన్నికల గురించి మాట్లాడడమే లేదు. గతంలో ఆ రాష్ట్రం నుండి బడా నేతను పిలిపించుకొని డప్పు కొట్టించారు. దేశానికి కేసీఆర్ దిక్కు అని కానీ ఇప్పుడు ఎన్నికల వేళా ఆయన ఉలుకు, పలుకు లేదు.

ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌తో కలిసి పోటీ చేస్తామని బీఆర్‌ఎస్‌ పేరు ప్రకటన సందర్భంగా కేసీఆర్‌ ప్రకటించారు. అయితే ఆ ప్రకటన ఆచరణలోకి రాలేదు. ఇవాళ అక్కడ నామినేషన్ల దాఖలు గడువు కూడా ముగిసింది. అంతేకాదు కర్ణాటకలో బీఆర్‌ఎస్‌లో చేరికలు కూడా పెద్దగా లేవు. దీనికి కారణం లేకపోలేదు. బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తరణలో భాగంగా ఏపీ, ఒడిషా, మహారాష్ట్రలో నేతలను చేర్చుకుంటున్న ఆ పార్టీ కర్ణాటకలో మాత్రం ఎందుకు ఫోకస్‌ చేయడం లేదన్న ప్రశ్న తలెత్తుతున్నది.

దీనికి అనేక కారణాలున్నాయి. అక్కడ ముక్కోణపు పోటీ ఉంటుందని అనుకున్నా… ఎన్నికల నోటిఫికేషన్‌ కు ముందు నుంచి నిన్నమొన్నటివరకు అక్కడ కాంగ్రెస్‌, బీజేపీల మధ్యే ప్రధానపోటీ ఉండబోతున్నదని ఆ ఫలితాలను బట్టి అర్థమౌతున్నది. జేడీఎస్‌ బరిలో ఉన్నా.. అది నామమాత్రమే అని స్పష్టమౌతున్నది. అలాగే అక్కడ బీఆర్‌ఎస్‌ పోటీచేయకపోవడానికి మరో కారణం ఉన్నది. జాతీయ రాజకీయాల్లోకి రావడానికి ముందు కేసీఆర్‌ వివిధ రాష్ట్రాల సీఎంలు, పార్టీల అధినేతలతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్‌ కూటములకు వ్యతిరేకంగా కూటమి కడుదామని కేసీఆర్‌ ప్రతిపాదించారు. దీన్ని తమిళనాడు సీఎం స్టాలిన్‌, మహారాష్ట్ర అప్పటి సీఎం ఉద్ధవ్‌ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ లు అప్పుడే తిరస్కరించారు. కాంగ్రెస్‌ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి సాధ్యం కాదని స్పష్టం చేశారు. అందుకే కేసీఆర్‌ తన ఆలోచనలకు,అభిప్రాయాలకు దూరంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతల రాష్ట్రాల్లో పార్టీ విస్తరణను ముందుగా మొదలుపెట్టినట్టు కనిపిస్తున్నది.

ఇక కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు పోటీచేయర‌ని బీఆర్ఎస్‌ నేతలను మీడియాలో చర్చల సందర్భంగా ప్రశ్నిస్తే.. మా పార్టీ సిద్ధాంతం ప్రజల్లోకి ఇంకా వెళ్లలేదని.. మాకు తొందరేమీ లేదని.. ఇప్పుడు అక్కడ పోటీ చేసినా ఫలితాలు ఎలా ఉంటాయో మాకు తెలుసు అని జవాబులు ఇస్తున్నారు. అంటే అక్కడ పోటీచేస్తే ఓడిపోతామని ఆ నేతల మాటల సారాంశం. అదే జరిగితే ఇతర రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ బలపడటానికి చేస్తున్న ప్రయత్నాలపై ప్రభావం పడుతుందని బీఆర్‌ఎస్‌ అధినేత భావించారు. అందుకే అక్కడ జేడీఎస్‌కు మద్దతు ఇస్తున్నారు. కానీ ఆ పార్టీ గెలుపు కోసం ప్రచారానికి వెళ్తారా? లేదా అన్నది కూడా బీఆర్‌ఎస్‌ నేతల నుంచి క్లారిటీ లేదు. దీంతో అక్కడ పోటీ లేదని ఇప్పటికే తేలిపోయింది. ఇక కేసీఆర్‌ జేడీఎస్‌ కు మద్దతుగా ప్రచారానికి వెళ్తారా లేదా ? అన్నది తేలాల్సి ఉన్నది.

Leave a Reply

%d