స్మార్ట్ ఫోన్ ఈ పేరు వినని వారు ఉండరు. మార్కెట్లోకి ఏ కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చినా కొనేందుకు ఆసక్తి చూపేవారు లక్షల్లోనే ఉంటారు. అలాంటి వారి కోసం మొబైల్ దుకాణాల యజమానులు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తుంటారు. ఓ మొబైల్ షాపు యజమాని కూడా ఆఫర్ ప్రకటించారు. అది ఎవరూ ఊహించని ఆఫర్. తన షాపులో స్మార్ట్ ఫోన్ కొంటే.. రెండు బీర్లు ఉచితంగా ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ భదోయికి చెందిన రాజేశ్ మౌర్య అనే వ్యక్తి చౌరీ రోడ్డులో మొబైల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అయితే తన షాపులో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కొంటే ఉచితంగా రెండు బీర్లు ఇస్తానని పోస్టర్ల ద్వారా పబ్లిసిటీ చేశాడు. ఈ ఆఫర్ కేవలం మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు అని ప్రకటించాడు. దీంతో రాజేశ్ మౌర్య దుకాణం వద్దకు భారీ స్థాయిలో జనాలు తరలివచ్చారు. స్మార్ట్ ఫోన్లను కొనేందుకు తెగ ఆసక్తి చూపారు. స్థానికంగా జనాలు గుమిగూడటంతో, సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. షాపుపై ఎగబడ్డ జనాలను పోలీసులు చెదరగొట్టారు. అనంతరం రాజేశ్ మౌర్యను పోలీసులు అదుపులోకి తీసుకుని, షాపును సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.