రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాధినేతలనైనా కలవచ్చు కానీ.. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవలేమని అన్నారు. అభివృద్ధి అంటే ఒక్క కుటుంబం కోసం కాదని, అందరూ అభివృద్ధి చెందాలని వ్యాఖ్యానించారు. కొందరు మాటలు చెబుతారు తప్ప.. పనులు చేయరని పరోక్ష విమర్శలు చేశారు. ప్రగతిభవన్.. రాజ్ భవన్ దూరంగా ఉంటున్నాయని తెలిపారు. సచివాలయం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. జీ–20 సన్నాహక సదస్సుల్లో భాగంగా బుధవారం గచ్చిబౌలి రాడిసన్ హోటల్‌లో నిర్వహించిన సీ–20 సమావేశానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘దేశాధినేతలనైనా కలవవచ్చు.. కానీ, ఈ స్టేట్ చీఫ్‌ని మాత్రం కలవలేం. నన్ను సెక్రటేరియట్ ఓపెనింగ్‌కే పిలవలేదు’’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు.
For More News Click: https://eenadunews.co.in/
జీ–20 సదస్సుకు భారతదేశం అధ్యక్షత వహించడం గర్వకారణమని, విభిన్న నేపథ్యాలు, దృక్కోణాలు కలిగిన వ్యక్తులు ఒకచోట చేరినప్పుడు గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంటుందని అన్నారు. అన్ని రంగాల్లోని సమస్యలకూ భారతదేశం పరిష్కారం చూపిస్తోందని తెలిపారు. కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లో చూపిస్తున్నామని, కరోనా సంక్షోభంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. కొవిడ్‌తో భారత్‌లో 45 లక్షల మంది చనిపోతారని ఇతర దేశాలు అన్నాయని, కానీ.. అన్ని దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి వారినే మనం కాపాడామని గుర్తు చేశారు. కొందరు మాత్రం చేసే పనిని వ్యతిరేకిస్తుంటారని వ్యాఖ్యానించారు. కొవిడ్ సమయంలో తెలంగాణలో డాక్టర్లు కూడా వైరస్ బారిన పడ్డారని, తాను గాంధీ ఆస్పత్రికి వెళ్లి చూశానని గవర్నర్ తమిళిసై చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్నో సాధించామని, కేవలం ప్రేమతోనే మనమంతా కొవిడ్‌ను ధైర్యంగా ఎదుర్కోగలిగామని అన్నారు. మోదీ నేతృత్వంలో మనం ప్రపంచాన్ని నడిపిస్తున్నామని, భారతదేశం నంబర్‌వన్ ఆర్థికశక్తిగా మారుతోందని పేర్కొన్నారు. కానీ, కొంత మంది కేవలం మాటలు చెబుతారే తప్ప.. పనులు చేయరంటూ వ్యాఖ్యానించారు. అందరమూ ప్రజల కోసమే ఉన్నామని, అందుకు తగ్గట్టు పని చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో 20 సౌస్ షెర్పా డీఎం కిరణ్, రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద, సేవా ఇంటర్నేషనల్ డైరెక్టర్ స్వాతిరామ్ తదితరులు పాల్గొన్నారు.