మెడ దగ్గర ఉండే రక్తనాళాన్ని కెరోటిడ్ ఆర్టెరీ అంటారు. గుండె నుంచి మెదడుకు రక్తాన్ని సరఫరా చేయడంలో ఇది చాలా కీలకం. సాధారణంగా గుండెలో రక్తనాళాలు పూడుకుపోతే గుండెపోటు వస్తుందని మనకు తెలుసు. కానీ, మెడ దగ్గర ఉండే ఈ కెరోటిడ్ ఆర్టెరీ దాదాపు పూర్తిగా పూడుకుపోవడంతో మెదడుకు రక్తసరఫరా తగ్గిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వృద్ధురాలికి అనంతపురంలోని కిమ్స్ సవీరా వైద్యులు సకాలంలో గుర్తించి చికిత్స అందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మూడే సందీప్ తెలిపారు.
‘‘అనంతపురం నగరానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలికి కుడిచెయ్యి, కుడికాలు బాగా బలహీనపడటంతో ఆమె ఒక న్యూరాలజిస్టు వద్దకు వెళ్లారు. ఆ సమస్యను బ్రెయిన్ స్ట్రోక్ అని నిర్ధారించారు. ఎంఆర్ఐ తీస్తే ఒక రక్తనాళం బ్లాక్ అయినట్లు తెలిసింది. అందుకు కారణాలు ఏంటని మరింత లోతుగా పరీక్షలు చేయగా… గుండె నుంచి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే అత్యంత కీలకమైన కెరోటిడ్ రక్తనాళం (ఇది మెడ దగ్గర ఉంటుంది) 99% బ్లాక్ అయినట్లు గుర్తించారు. ఇది చాలా సంక్లిష్టమైన సమస్య కావడంతో అక్కడినుంచి కిమ్స్ సవీరా ఆస్పత్రికి పంపారు. బీపీ ఎక్కువగా ఉండటం వల్లే ఆయనకు ఈ కీలకమైన రక్తనాళం దాదాపు పూర్తిగా బ్లాక్ అయినట్లు గుర్తించాము. దానికి స్టెంట్ వేయడం మెరుగైన మార్గం కావడంతో, అందుకు అవసరమైన పరికరాలు అన్నింటినీ సేకరించి, కెరోటిడ్ ఆర్టెరీ స్టెంటింగ్ (సీఏఎస్) చేశాం. దాంతో మెదడుకు రక్తసరఫరా పూర్తిస్థాయిలో పునరుద్ధరించగలిగాము. రోగి పూర్తిగా కోలుకున్నారు. ఇదంతా కేవలం లోకల్ ఎనస్థీషియాతోనే చేయడం గమనార్హం. కెరోటిడ్ స్టెంటింగ్ అనేది పూర్తిగా కొత్త ప్రక్రియ. ఇందులో ఒక చిన్న వైర్ మెష్ లాంటి పరికరాన్ని కెరోటిడ్ ఆర్టెరీలోకి పంపి, బ్లాక్‌ను ఓపెన్ చేస్తాం. దానివల్ల రక్తసరఫరాను పునరుద్ధరించగలం. కెరోటిడ్ ఎండర్టెరెక్టమీ అనే చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఈ స్టెంటింగ్ ఉపయోగపడుతుంది. ఇందులో జనరల్ ఎనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు. మెడ దగ్గర ఆపరేషన్ చేయాల్సి వస్తే మయోకార్డియల్ ఇన్‌ఫార్క్షన్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అవి రాకుండా కాపాడగలం.
రాయలసీమలో ఇలా 99% బ్లాక్ అయిన మెడ రక్తనాళానికి స్టెంట్ వేయడం ఇదే మొట్టమొదటి సారి. పైపెచ్చు, ఇదంతా ఆరోగ్యశ్రీ పథకంలోనే చేశాం. వయసు వల్ల, కొలెస్టరాల్, బీపీ ఎక్కువ ఉండటం లాంటి కారణాలతో ఈ రక్తనాళం సన్నబడుతుంది. ఈ పేషెంటుకు బీపీ ఎక్కువగా ఉంది. గతంలో ఇలాంటి తీవ్రమైన సమస్యలు ఉంటే హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకు వెళ్లేవారు. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా కిమ్స్ సవీరాలోనే అన్నిరకాల ఆధునిక పరికరాలో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. నిజానికి ఇది గుండెకు సంబంధించిన సమస్య కాదు. అయినా కార్డియాలజిస్టు దీనికి చికిత్స చేయడం మరో విశేషం. స్టెంట్ వేసుకున్న తర్వాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్ ఫాలో అప్ ఉండాలి, తగిన మందులు వాడాలి, బీపీ, కొలెస్టరాల్, షుగర్ అన్నీ సాధారణంగా ఉండేలా జాగ్రత్తపడాలి. ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాలి. స్టెంట్ వేసేటప్పుడు ఎక్కడా కుట్లు వేయాల్సిన అవసరం ఉండదు. చిన్న పాటి ఇన్సిషన్‌తోనే వేశాం. దీంతో ఎలాంటి సమస్యలు లేకుండా రోగి పూర్తిగా కోలుకోగలిగారు’’ అని డాక్టర్ సందీప్ వివరించారు.
స్టెంట్ అనగానే గుండెకు మాత్రమే అనుకుంటారు. కానీ కెరోటిడ్ ఆర్టెరీ, రీనల్ ఆర్టెరీ, పెరిఫెరల్ ఆర్టెరీలకు కూడా కిమ్స్ సవీరా ఆస్పత్రిలో స్టెంటింగ్ వేస్తున్నట్లు డాక్టర్ మూడే సందీప్ తెలిపారు.