విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన ఆందోళనను వదిలిపెట్టాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని చురుగ్గా ఉండాలని సెంచురీ ఆస్పత్రి వైద్యులు సూచించారు. రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లి క్రాస్ రోడ్డు వద్ద గల అక్షర మోడల్ హైస్కూలు ప్రాంగణంలో గురువారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. దాదాపు 460 మంది విద్యార్థులు, పాఠశాల సిబ్బందితో పాటు, కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ శిబిరానికి హాజరయ్యారు. అంతకుముందు ఈ నెల 6 వ తేదీన కూడా ఇదే హైస్కూల్లో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఒక్కరోజు అందరినీ చూడటం సాధ్యంకాదన్న ఉద్దేశంతో రెండు రోజులు వేర్వేరుగా వైద్యపరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులందరికీ ఎత్తు, బరువు, బీఎంఐ కొలవడంతో పాటు బీపీ, పల్స్, ఎస్‌పీఓ2, టెంపరేచర్ లాంటి పరీక్షలు చేశారు. విద్యార్థులందరికీ తల నుంచి కాలివేళ్ల వరకు మొత్తం అన్ని అంగాలకు సంబంధించిన జనరల్ చెకప్ చేశారు. బాలికలకు రుతుక్రమానికి సంబంధించిన సమస్యలు, విషయాలు చెప్పి, వారికి అవగాహన కల్పించి, ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన ఆందోళన అవసరం లేదంటూ కౌన్సెలింగ్ చేశారు. ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు పళ్లు, దంతాలు పరీక్షించి, ఆహారం తీసుకున్న తర్వాత తప్పనిసరిగా నోరు పుక్కిలించి ఉమ్మాల్సిన అవసరం గురించి వారికి క్షుణ్నంగా వివరించారు. విద్యార్థులందరికీ పోషకాహారం ప్రాముఖ్యతను తెలిపి, చిరుతిళ్లు.. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. జ్వరం, దగ్గు ఉన్న విద్యార్థులకు మందులు సూచించి, కొన్ని రక్తపరీక్షలు కూడా చేయించుకోవాలని తెలిపి, దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆస్పత్రికి చెందిన వైద్యురాలు డాక్టర్ చిగురుపాటి మోనిషా సాయి, నర్సులు, ఇతర ఆస్పత్రి సిబ్బంది ఈ శిబిరాల్లో పాల్గొన్నారు.
ఆరోగ్యశిబిరంలో సెంచురీ ఆస్పత్రి సీఈవో డాక్టర్ హేమంత్ కౌకుంట్ల మాట్లాడుతూ, ‘‘విద్యార్థులందరూ తప్పనిసరిగా చేతుల పరిశుభ్రతను పాటించాలి. ఆహారం తీసుకునే ముందు తప్పనిసరిగా చేతులను సబ్బుతో శుభ్రపరుచుకోవాలి. దీనివల్ల వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. ఏదైనా పదార్థం తిన్న తర్వాత మర్చిపోకుండా నోరు బాగా పుక్కిలించి ఉమ్మేయాలి. అలా చేస్తే పళ్లు పుచ్చిపోకుండా ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో హెచ్3ఎన్2 రకం వైరల్ జ్వరం తీవ్రంగా వ్యాపిస్తోంది. బయటకు వెళ్లినప్పుడు మాస్కు ధరించడం, చేతులతో వేటినీ ముట్టుకోకపోవడం చాలా ముఖ్యం. ఉదయాన్నే తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలి. ఆటపాటల ద్వారా తగిన శారీరక శ్రమ పిల్లలకు వస్తుంది. అందుకని రోజూ కనీసం గంట పాటు ఆడుకుంటే మంచిది’’ అని సూచించారు.