కాంగ్రెస్ లో కీలక నేతలు ‘ఎవరికి వారే..’ అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ‘హాత్ సే హాత్‌జోడో’ యాత్రను కాస్తా తమ సొంత యాత్రగా మార్చేస్తున్నారు. వేర్వేరు పేర్లతో యాత్రలు చేపడుతూ జనాల్లోకి వెళ్తున్నారు. దీంతో పార్టీలో ఇన్ని రోజులు సద్దుమణిగిందనుకుంటున్న వర్గ పోరు మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మధ్య పోరు ముదిరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నల్గొండ నేతలు రేవంత్ యాత్ర తమ జిల్లాలోకి రాకుండా అడ్డుకోగా.. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోనూ రేవంత్అడుగుపెట్టకుండా ఏలేటి వ్యూహం పన్నుతున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. మరోవైపు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలను మాత్రమే ఏలేటి తన యాత్రకు ఆహ్వానించారు.
నిజానికి ముఖ్య నేతలంతా ఎవరికి వాళ్లే తమ నియోజకవర్గాల్లో ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర చేసుకోవచ్చని హైకమాండ్ చెప్పింది. కానీ, నేతలు ఆ యాత్ర స్వరూపాన్నే మార్చేశారు. రేవంత్ ‘యాత్ర ఫర్ చేంజ్’ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. తాజాగా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ‘‘కాంగ్రెస్ పోరు యాత్ర’’ పేరుతో యాత్ర మొదలుపెట్టారు. శుక్రవారం బాసరలో పూజలు చేసిన తర్వాత భైంసా నుంచి యాత్రను ప్రారంభించారు. దీనికి ఉత్తమ్, భట్టి హాజరయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన రేవంత్ సభలో భట్టి పాల్గొనగా, ఉత్తమ్ వెళ్లలేదు. కానీ ఇప్పుడు ఏలేటి పిలవగానే ఉత్తమ్ భైంసా వెళ్లి యాత్రలో పాల్గొన్నారు. తన యాత్ర కోసం హైదరాబాద్ నుంచి గాంధీభవన్ వ్యవహారాలు కవర్ చేసే మీడియాను భైంసా తీసుకెళ్లాలని ఏలేటి అనుకున్నారట. కానీ, అంతకన్నా ముందే రిపోర్టర్లను రేవంత్ తీసుకెళ్లిపోయారన్న చర్చ నడుస్తోంది.
ఈ నెల 1న నల్గొండ జిల్లాలోకి రేవంత్ యాత్ర ఎంటర్ కావాల్సి ఉంది. కోదాడలో జరిగే కార్యక్రమంలో కాంగ్రెస్ స్టేట్ ఇన్‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రే పాల్గొనేలా షెడ్యూల్ రూపొందించారు. సడెన్‌గా రేవంత్ యాత్ర కరీంనగర్‌కు మారింది. ఈ నెల 1న కోదాడ వెళ్లిన ఠాక్రే.. షెడ్యూల్ ప్రకారం తర్వాతి కార్యక్రమాల్లో పాల్గొని, హైదరాబాద్ తిరిగొచ్చారు. తర్వాత శుక్రవారం పార్టీ నేతలతో ఆయన సమావేశం కావాల్సి ఉండగా, రద్దు చేశారు. ఠాక్రే సాయంత్రం మానకొండూరు వెళ్లి రేవంత్ యాత్రలో పాల్గొన్నారు. రేవంత్ యాత్ర రూటు మారడంతో ఠాక్రే షెడ్యూల్ కూడా మారిందని సమాచారం. కోదాడ నుంచి యాత్ర మొదలుపెట్టిన ఉత్తమ్ తన లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని హుజూర్నగర్సహా కీలక నియోజకవర్గాల్లో యాత్ర చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు త్వరలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా యాత్ర మొదలుపెట్టనున్నట్లు సమాచారం.