కామారెడ్డి నుండి కేసీఆర్ పోటీ ?

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అభ్యర్థుల ఖరారులో తీరిక లేకుండా ఉన్నారు. చాలా నియోజకవర్గాలపై ఆయనకు క్లారిటీ వచ్చింది. అయితే స్వయంగా తాను పోటీచేయాల్సిన నియోజకవర్గంపై మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన నియోజకవర్గం మారాలనుకుంటున్నారన్న అంశం కొంత కాలంగా  చర్చల్లో ఉంది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగా దమ్ముంటే గజ్వేల్  నుంచే పోటీ చేయాలని సవాల్ చేశారు. దీంతో  సారి గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయడం లేదా అన్న చర్చ జరుగుతోంది. ఈ సమయంలో కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది.

 అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీఆర్ఎస్ వ్యూహాలకు మరింత పదునుపెడుతోంది.  అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గాలవారీగా సిట్టింగులకు సంబంధించి ఇప్పటికే సర్వే రిపోర్టులు సిద్ధం చేయించిన గులాబీబాస్‌.. ఆ నివేదికల ఆధారంగా టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే కామారెడ్డిలో నిర్విహంచిన సర్వేలో ఎమ్మెల్యే గంప గోవర్థన్ పనితీరు ఏ మాత్రం బాగోలేదని తేలినట్లు తెలుస్తోంది. గంప గోవర్థన్‌కు మళ్లీ టికెట్ ఇవ్వడం, అభ్యర్థిని మార్చడం, కేసీఆర్ స్వయంగా పోటీ చేయడం తదితర అంశాలపై స్థానికుల అభిప్రాయాలు తీసుకున్నారని అంటున్నారు. కేసీఆర్ అభ్యర్థిత్వానికి అనూహ్య స్పందనవచ్చిందని చెబుతున్నారు.

సీఎం కామారెడ్డి నుంచి బరిలో దిగితే పక్కనున్న రామాయంపేట, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్‌తోపాటు జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మరింత బలం పుంజుకుంటుందని కేసీఆర్‌ ఆలోచనగా చెబుతున్నారు.  ఇదిలా ఉంటే ఒకవేళ కేసీఆర్ బరిలో దిగితే కామారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్థన్ పరిస్థితి ఎంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే గంపకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా ప్రాధాన్యత ఉన్న పదవి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయనతో చర్చించినట్లు సమాచారం. అయితే గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

గజ్వేల్ నియోజకవర్గంలోకేసీఆర్‌పై రెండు సార్లు తెలుగుదేశం పార్టీ తరపున వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేశారు. నిజానికి అక్కడ కేసీఆర్ అభ్యర్థి కాకపోతే ఆయనే  గెలుస్తారన్నంతగా ప్రజల్లో తిరిగారు. ఆయనపై ప్రజల్లో సానుభూతి కూడా ఉంది. గత ఎన్నికల తర్వాత ఆయన బీఆర్ఎస్‌లో చేరిపోయారు. పార్టీలో చేరే ముందే వంటేరు ప్రతాప్ రెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే రెండు చోట్ల పోటీ చేయాల్సి వస్తే.. ఎన్నికల తర్వతా గజ్వేల్ కు రాజీనామా చేసి వంటేరుకు చాన్స్ ఇస్తారని అంటున్నారు.

Leave a Reply

%d bloggers like this: