కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల చేపట్టిన జోడో యాత్ర పార్టీతో పాటు రాహుల్ లోనే అనేక మార్పులు వచ్చాయనే చెప్పుకోవాలి. కన్యకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం అంటే నిజంగా సాహసమనే చెప్పుకోవాలి. ఈ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి మార్కులు వస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే పాదయాత్ర ముగిసిన చివరి రోజు కాశ్మీర్ లో రాహుల్ గాంధీ మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. రాహుల్ గాంధీ ప్రసంగం మొత్తం హిందీలోనే ఉంది కదా తెలుగు ప్రజలకు ఎలా అర్ధం అవుతుంది. ఇది ఇక్కడ వచ్చిన ప్రశ్న. అయితే తెలుగువారి కోసం ప్రముఖ సామాజిక కార్యకర్త అనూష చేసిన అనువాదం ఇప్పుడు సామాజిక మాద్యామాల్లో చెక్కర్లు కొడుతోంది.
‘అను’ వాదమే ఇది మీకోసం చదవండి
ఈ దేశ ఆలోచనా విధానాన్ని రక్షించడంమే ఈ యాత్ర లక్ష్యం.!
వేదికపై ఉన్న ముఖ్యులు, కాంగ్రెస్ పెద్దలు, విపక్ష పార్టీ పెద్దలు, ప్రియమైన కార్యకర్తలు, అక్క చెల్లెల్లు, పత్రికా మిత్రులు, మీ అందరికి హృదయ పూర్వక స్వాగతం.
మీరు ఈ రోజు ఇక్కడ మంచులో నిలబడ్దారు కానీ మీలో ఎవ్వరికి చలి పెట్టట్లేదు. మీరిక్కడ వర్షంలో నిలబడ్డా మీరెవ్వరూ తడవలేదు. వేసవి కాలంలో మీకు ఎండ తగల్లేదు. శీతాకాలంలో మీకు చలి పెట్టట్లేదు. ఎందుకంటే ఈ దేశశక్తి మీతో ఉంది.
ప్రియాంక మాటల్ని నేను విన్నాను. ప్రియాంక నా సందేశం గురించి చెప్పింది. సాధారణంగా నేను ఏడవను కానీ నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే ఈ యాత్రను నేను కన్యాకుమారి నుండి మొదలు పెట్టాను. దేశం మొత్తం నడుచుకుంటూ వెళ్లాము.
మీకు నమ్మశక్యంగా ఉండకపోవచ్చు కానీ నిజం చెప్పాలంటే చాలా సంవత్సరాలుగా నేను ప్రతి రోజు 8 నుండి 10 కీలోమీటర్లు పరిగెట్టేవాడిని. అందుకే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు వెళ్లడం పెద్ద విషయమేమీ కాదనుకున్నాను. నా మనసుకనిపించిది చాలా అవలీంగా ఈ యాత్ర అయిపోతుందని. కానీ ఫిజికల్‌గా చూసుకుంటే అంత దూరంగా నడవడం కష్టమైన పనే. నేను నా మనసుకు నచ్చచెప్పాను. లేదిది నేను సులభంగా పూర్తిచేస్తానని. ఈ మాత్రం చేయలేనా అనే అహంకారం వచ్చింది నాలో. కానీ పరిస్థితి మారిపోయింది. చిన్నప్పటి నుండి పుట్‌బాల్ అడేవాడిని, కాలేజీ రోజుల్లో ఒకసారి ఫుట్‌బాల్ అడుతుంటే మోకాలిని దెబ్బతగిలింది. నేను దాన్ని మర్చిపోయాను. ఎందుకంటే మోకాలిలో నొప్పుండేది కాదు కాబట్టి. నొప్పి కూడా మాయమైంది. కానీ కన్యాకుమారికి చేరుకున్న ఐదారు రోజుల తర్వాత మోకాల్లలో నొప్పి ప్రారంభమైంది. అది చాలా పెద్ద సమస్య అయ్యింది. నా అహాంకారం అంతా దిగిపోయింది. మిగిలున్నా 3500 కిలోమీటర్లు నేను నడవగలనా అసలు అని దిగులు పడిపోయా. నేనేదైతే చాలా సులభంగా అయిపోతుందనుకున్నానో అది చాలా కష్టతరం అయిపోయింది. కానీ నేను ఎలాగో అలా ఈ పనిని పూర్తిచేశా. చాలా నేర్చుకున్నాను. చాలా నొప్పిని భరించాల్సి వచ్చింది, అయినా భరించా. ఒకరోజు నడుస్తుంటే మధ్యలో కాళ్లలో చాలా నొప్పి వచ్చింది. భరించరానంతగా అయింది. నడవాల్సిందేమో ఇంకా ఎడెనిమి గంటలుంది. ఆ రోజు నాకు అనిపించింది ఈరోజు కష్టమని. కానీ ఒక చిన్నపిల్ల పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి నేను మీకోసం ఒకటి రాసుకొచ్చాను అని చెప్పింది. కానీ దీన్ని నువ్వు ఇప్పుడే చదవద్దు తర్వాత చదువు అని ఒక కౌగిలిని ఇచ్చి పారిపోయింది. ఏం రాసిందో చుద్దాం అనుకున్నాను. ‘‘నా కర్థమవుతుంది మీ మోకాళ్లలో నొప్పుందని. ఎందుకంటే మీరొకే కాలిపై బరువేసి నడుస్తున్నప్పుడు ఆ నొప్పి మీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. నేను మీతో కలిసి కన్యాకుమారి వరకు కలిసి రాలేను, ఎందుకంటే అందుకు మా తల్లిదండ్రులు ఒప్పుకోరు. కానీ నా మనుసులో నేను మీ పక్కనే మీతోపాటు నడుస్తున్నాను. ఎందుకంటే నాకు తెలుసు మీరు మీకోసం నడవట్లేదు. నా కోసం, నా భవిష్యత్తుకోసం నడుస్తున్నారు మీరు’’ అని లేఖలో రాసి ఉంది. ఎంత విచిత్రం ఆ క్షణంలో నాకే తెలియకుండా ఆ నొప్పి ఆరోజు మాయమైపోయింది.
ఇంకో విషయం.చెప్పాలో లేదో నాకు తెలియదు. పొద్దున నేను నడుస్తున్నప్పుడు ఇక్కడ చలి తీవ్రంగా పెరుగుతుంది. నలుగురు పిల్లలు వచ్చారు. చిన్నపిల్లలు, యాచకులు వాళ్లు . బట్టలు వేసుకోలేదు, బహుశా వాళ్లు కూలీ పనిచేస్తారేమో. వాళ్ల శరీరానికి మట్టి అంటుకొని ఉంది. అవేవి నేను పట్టించుకోను కాబట్టి నా మోకాళ్లపై కూర్చొని ఆ పిల్లల్ని అమాంతం వాటేసుకున్నాను. ఎందుకంటే నేను వాళ్ల ఎత్తుకి సరిసమానంగా ఉండాలంటే మోకాళ్లమీద ఉండాల్సిందే. వాళ్లకు చలిపెడుతుంది. వణుకుతున్నారు. బహుశా వాళ్లు తినుండకపోవచ్చు.ఎటువంటి బట్టలు వేసుకోలేదు, కనీసం స్వెటర్ కూడా లేదు. మరి నేనేలా వేసుకోగలను అనిపించింది నాకు. కానీ నేనెందుకు తడబడ్డానో మీకు చెబుతాను. మేము నడుస్తున్నప్పుడు మాతోపాటు నడుస్తున్న ఒక వ్యక్తి వచ్చి ‘‘రాహుల్ గారు ఆ పిల్లలు చాలా మురికిగా ఉన్నారు..మీరలా వాళ్లదగ్గరకు వెళ్లకుండా ఉండాల్సింది’’ అని అన్నారు. నేనతనితో ‘‘ ఆపిల్లలు నీకన్నా, నాకన్న కూడా చాలా శుభ్రంగా ఉన్నారన్నాను. దేశంలో ఈ రకమైన ఆలోచన విధానం కూడా మనకు అపుడపుడు ఎదురుపడుతుంది.
ఇంకో విషయమేంటంటే బహుశా జనాలకు నచ్చదేమో. నేను నడుస్తున్నప్పుడు మీరు చూశారు, చాలా మంది మహిళలు ఏడుస్తున్నారు. మీకు తెలుసా వాళ్లు ఎందుకు ఏడుస్తున్నారో?. అందులోని చాలా మంది మహిళలు నన్ను చూడగానే భావేద్వేగానికి గురయ్యారు. ఏడవడం మొదలెట్టారు. కానీ కొంతమంది మహిళలు నిర్మోహమాటంగా నా దగ్గరకు వచ్చి మేము బలత్కరించబడ్డామని, వాళ్లని కొందరు లైంగిక వేధింపులకు గురిచేశారని చెప్పారు. అందులో వాళ్ల సొంత బంధువులున్నారు. నేను ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాలా అని వాళ్లను అడిగినప్పుడు వాళ్లు, లేదు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పొదు, కేవలం మేము మీకు తెలియజేస్తున్నాం…మేము మీకు మాత్రం చెబుతున్నాం. ఈ విషయాన్ని పోలీసుల దాకా తీసుకెళ్లవద్దు. ఎందుకంటే ఇంకా ఎక్కువ భరించాల్సి వస్తుందన్నారు. ఇది వాస్తవం. ఇది మన దేశ నిజస్వరూపం. ఇలాంటి ఎన్నో కథల్ని నేను మీకు చెప్పగలను.
నేను కాశ్మీర్ వైపుగా నడుస్తున్నప్పుడు నాకు అనిపించింది. నేను కిందినుండి పైకి వెళుతున్నాను కదా, ఇదే మార్గాన ఒకప్పుడు నా బంధువులు పై నుండి కిందకి వచ్చింటారు అని. కాశ్మీర్ నుండి అలహాబాద్‌లోని గంగావైపుకు వెళ్లారు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నా సొంతింటికి తీరిగి వెళుతున్న అనుభూతి కలిగింది. చిన్నప్పటినుండి నేను ప్రభుత్వం మాకు ఇచ్చిన ఇళ్లల్లోనే ఉన్నాను. మాకంటూ ఓ సొంత ఇళ్లులేదు. అందుకే నాలుగు గోడలున్నదాన్ని ఎప్పుడూ నేను ఇళ్లు అనుకోలేదు. నేను ఎక్కడైతే ఉన్నానో అవన్నీ కూడా కట్టడాలు మాత్రమే, ఇళ్లుకాదు. ఇళ్లంటే ఒక ఆలోచన నాకు. ఒక జీవన విధానం. ఆలోచించే ఒక పద్ధతి. ఇక్కడ మీరు దేన్నైతే కాశ్మీరియత్ అని అంటారో దాన్ని నేను నా ఇళ్లంటాను. ఇదే నా ఇళ్లు. అసలు ఈ కాశ్మీరియత్ అంటే ఏంటీ? ఒకవైపు ఆ శివుని ఆలోచన ఏదైతే ఉందో, అందులోకి ఇంకాస్త లోతులోకి వెళితే అక్కడ శూన్యముంటుంది. మనమీద మనమే, మన అహంకారాన్ని మనమే, మన ఆలోచనని మనమే ఆక్రమించుకోవడం. ఇంకోవైపు ఇక్కడ మనం దేనైతే శూన్యమంటామో ఇస్లాంలో దాన్ని వాళ్లు ‘ఫనా’ అంటారు. ఈ రెండింటి అర్థమొకటే. ఇస్లాంలో కూడా ఫనా అనేదానికర్థం మనల్ని మనం ఆక్రమించుకోవడం, మన ఆలోచనల్ని మనం ఆక్రమించుకోవడం. మన అహంకారాన్ని మనం ఆక్రమించుకోవడం. మనకంటూ మనం ఒక సరిహద్దును గిరిగీసిపెట్టుకుంటాం మేమింతే, నా దగ్గర ఈ ఇళ్లుంది, నా దగ్గర ఈ కోట ఉంది అంటూ మన దగ్గరున్న దాన్నే మనమే ఆక్రమించుకుంటాం, అదే శూన్యం, అదే ఫనా. ఈ భూమ్మిద ఉన్న ఈ రెండు ఆలోచనా విధానాల మధ్య ఒక దగ్గరి సత్ససంబంధం ఉంది. అదెన్నో సంవ్సతరాల తరబడి వస్తున్నది. దీన్నే మనం కాశ్మీరియత్ అంటాం. ఇదే ధోరణి మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది. గాంధీ గారు వైష్ణవజంతో గురించి మాట్లాడేవాడు. వాటినే మనమిక్కడ శూన్యం, ఫనా అంటాం, గుజరాత్‌లో వైష్ణవజం అంటారు. అస్సాంలో ఆ శంకరభగవానుడు కూడా ఇదే చెప్పాడు. కర్నాటక నుండి మనతో పాటు ఎంతో మంది వచ్చారిక్కడికి. ఆ కర్నాటకలోని ఆ బసవన్న కూడా ఇదే చెప్పాడు. కేరళలోని నారాయణ గురు, మహారాష్ట్రలోని జోతిబాపూలే ఇదే చెప్పారు. దాన్నే ఇక్కడ మనం కాశ్మీరియత్ అంటున్నాం. మనుషుల్ని కలుపుకోవడం, ఒకర్ని ఆక్రమించకుండా, మనల్ని మనమే ఆక్రమించకోవడం, మన లోపాల్ని చూసుకోవడం.
నా కుటుంబం కాశ్మీర్ నుండి గంగావైపుకు వెళ్లిందని మీకు చెప్పాను కదా నేను. అలహాబాద్‌లోని త్రీవేణి సంగమ ఒడ్డున మా ఇళ్లుంది. ఇక్కడి నుండి అక్కడికి వెళ్లినప్పుడు ఈ కాశ్మీరియత్ భావనను వాళ్లు ఆ గంగకు తీసుకెళ్లి ఉత్తరప్రదేశ్ అంతా వెదజల్లారు. ఉత్తరప్రదేశ్‌లో దాన్నే గంగా`జమునా తేజీబ్ అంటారు. నాకు కుటుంబం చేసింది మరీ అంత పెద్ద పనేం కాదు. చాలా చిన్నపని చేసింది. అది మీరు నేర్పించిందే వాళ్లకి. కాశ్మీరియత్‌లు నేర్పించారు. లధాక్ ప్రజలు నేర్పించారు. ఎందుకంటే ఇందులో విభిన్న ధర్మాలున్నాయి. వాళ్లదగ్గర కూడా అదే శూన్యం, ఫనా ఆలోచన వైఖరి ఉంది. వాళ్లు దాన్ని తీసుకెళ్లారు. ఆ ఆలోచనా విధానాన్ని, ఆ వైఖరినీ వాళ్లు గంగకు తీసుకెళ్లారు.
ఇవన్నీ ఆలోచిస్తూ నేను నడుస్తున్నప్పుడు సెక్యురిటీ వాళ్లు నాదగ్గరకొచ్చి చూడండి, ‘‘మీరు హిందూస్తాన్ అంతటా నడవచ్చు, జమ్మూలో కూడా నడవచ్చు. కానీ కాశ్మీర్‌లో చివరి నాలుగు రోజులు మాత్రం మీరు బండిలో వెళ్లితే బాటుంటుంది” అన్నారు. వేణుగోపాల్ గారు, నిర్వాహకులు మూడు నాలుగు రోజుల ముందే అడ్మినిస్ట్రేషన్ వాళ్లు కూడా చూడండీ (బహుశా నన్ను బయపెట్టడానికేమో) మీరు నడుచుకుంటూ వెళిలే మీమీద వాళ్లు గ్రెనెడ్ విసురుతారు అన్నారు. కానీ నేనైతే నా ఇంటికే తిరిగి వెళుతున్నాను కదా, అందుకే మా వాళ్లమధ్యే నడుస్తాను. పోనీలే నన్ను ద్వేషించే వాళ్లకి నా తెల్లచొక్క రంగు మార్చే అవకాశం అయినా ఇచ్చేస్తానని మనుసులో అనుకున్నాను. ఎందుకంటే నాకుటుంబం నాకు నేర్పించింది. ఆ గాంధీగారు నేర్పారు. బతకాలంటే భయం లేకుండా బతకాలని, భయపడితే బతకొద్దు అని. అందుకే నేను వాళ్లకు అవకాశం ఇచ్చాను. నేను నాలుగు రోజులు నడిచే తీరతానని నిశ్చయించుకున్నాను. మార్చేయండి నా టీ షర్ట్ రంగుని. ఎర్రగా మార్చేయండి చుద్దాం అని. నేనేదైతే అనుకున్నానో అదే జరిగింది. జమ్ము కశ్మీర్ ప్రజలు నాపై గ్రెనేడ్ విసరలేదు. వాళ్ల హృదయాంతరాలలో దాచిపెట్టుకున్న ప్రేమన్నంతా పంచారు. పిల్లలూ, పెద్దలూ అక్కలూ, తల్లులూ అంతా నన్ను వాళ్ల వానిగా అనుకొని కన్నీళ్లతో నాకు స్వాగతం పలికారు. ఎంతో ప్రేమను కురిపించారు. దానికి నాకు చాలా సంతోషం వేసింది.
నేనిక్కడున్న జమ్ముకాశ్మీర్ ప్రజలతో, సీఆర్‌పీఎఫ్ ఇంకా ఇక్కడ పనిచేస్తున్న మా సైనికులందరితో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. పిల్లలకీ, పెద్దలకీ, యువకులకీ, అక్కలకీ తల్లులకీ, బిఎస్‌ఎఫ్, సైనికులకీ, వాళ్ల కుటుంబాలకీ, వాళ్ల పిల్లలకీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. నేను హింసను అర్థం చేసుకోగలను. నేను హింసను చూశాను, భరించాను. ఎవరైతే హింసను చూడలేదో, భరించలేదో వాళ్లకి ఇది అర్థం కాదు. మోడీకి, అమిత్ షాకి, అరెస్సెస్ లాంటి వాళ్లకి ఇదర్థం కాదు. ఎందుకంటే వాళ్లు హింసను చూడలేదు. బయపడతారా వాళ్లు? అవును బయపడతారు. నేనిక్కడ నాలుగు రోజులు నడిచాను. కానీ ఖచ్చితంగా చెప్పగలను బీజేపీ నుండి ఏ ఒక్క నాయకుడు కూడా ఇలా నడవలేడు. ఈ కాశ్మీర్ ప్రజలు వాళ్లను నడువనివ్వరని కాదు, నడిచేంత ధైర్యం వాళ్లకు లేదు. వాళ్లు బయపడతారు. అందుకే వాళ్లు నడవరు.
నేను ఇక్కడున్న కాశ్మీర్ ప్రజలకు, చిన్నపిల్లలకు, సీఆర్‌పీఎఫ్ వాళ్లతో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను. నాకప్పుడు పదనాలుగు సంవత్సరాలు. ఉదయం స్కూల్లో జాగ్రఫీ క్లాస్ నడుస్తుంది. ముందే కూర్చుని ఉన్నాను. ఒక టీచర్ వచ్చి, రాహుల్ నిన్ను ప్రిన్సిపాల్ పిలుస్తున్నారన్నారు. చిన్నప్పుడు నేను చాలా అల్లరిచేసేవాడిని, చాలా అల్లరి పిల్లోడిని నేను. ఇప్పటికీ అల్లరి పిల్లోడినే అనుకోండి (నవ్వుతూ). ఆ విషయం ప్రియాంకను అడిగి తెలుసుకోవచ్చు మీరు. ఖచ్చితంగా నేనేదో చేసుంటాను అందుకే ప్రిన్సిపల్ నన్ను పిలుస్తున్నారు, నాకు ఇపుడు తిట్లు పడతాయి, తన్నులు తింటాను నేను అనుకున్నాను. నేను ప్రిన్సిపల్ క్యాబిన్ వైపు నడుస్తున్నాను కానీ నన్ను పిలవడానికి వచ్చిన టీచర్ మొహం చూసి ఏదో జరిగిందని అర్థమవుతుంది నాకు. నేను ప్రిన్సిపల్ క్యాబిన్‌లోకి వెళ్లినప్పుడు “రాహుల్ మీ ఇంటి నుండి ఫోన్ కాల్ వచ్చింది నీకు” అని ప్రిన్సిపల్ అన్నారు. నాకర్థమయింది ఏదో జరగరానిది జరిగిందని. నా కాళ్లు వణుకుతున్నాయి. ఫోన్ తీసుకొని నా చెవి దగ్గర పెట్టుకోగానే మా ఇంట్లో మా అమ్మతో పాటు ఉండే పనిమనిషి ‘‘రాహుల్, నాన్నమ్మకి బుల్లెట్ తగిలింది.. బుల్లెట్ తగిలిందని’’ అరిచి చెబుతుంది. పద్నాలుగు సంవత్సరాలు నాకపుడు. నేనిపుడు ఏదైతే మీకు చెబుతున్నానో అది మోదీకీి అర్థం కాదు, అమిత్ షాకి అర్థం కాదు, అజిత్ ధోవల్‌కి కూడా అర్థం కాదు. కానీ ఈ బాధ కశ్మీర్ ప్రజలకు అర్థమవుతుంది. ఈ బాధ సీఆర్‌పీఎఫ్ వాళ్లకు అర్థమవుతుంది. ఈ బాధ ఆర్మీ వాళ్లకు, వాళ్ల కుటుంబాలకు అర్థమవుతుంది. మోము (మా అమ్మతోపాటు ఉంటే పనిమనిషి) అరిచి చెబుతుంది నాన్నమ్మకు బుల్లెట్ తగిలింది, బుల్లెట్ తగిలిందని. ప్రియాంకను తీసుకొని నేను అక్కడినుండి బయలుదేరాను. మానాన్నమ్మ రక్తం మడుగులో పడున్న ప్రదేశానికి నేను వెళ్లాను, చూశాను. నాన్న వచ్చాడు. అమ్మ వచ్చింది. అమ్మకాస్త దిగ్భ్రాంతికి గురైంది. ఏమీ మాట్లాడలేక పోతుంది.
మేమంతా ఎవరమైతే హింసను చూశామో దీన్ని (మోబైల్‌ను చూపిస్తూ) అందరిలా కాకుండా ఇంకోలా చూస్తాం. ఇది మీ అందరికి సెల్‌ఫోన్ కావచ్చు. కానీ మాకిది కేవలం సెల్‌ఫోన్ మాత్రమే కాదు. దాని తర్వాత ఆరేడు సంవత్సరాలకి నేను అమెరికాలో
ఉన్నప్పుడు మళ్లీ ఫోన్ వచ్చింది. అది మే 21, 1991. పుల్వామా దాడిలో అమరులైన సైనికుల ఇంటికి ఫోన్ వచ్చినట్లుగా, వేల కాశ్మీరీల ఇంటికి ఫోన్ వచ్చిండొచ్చు. సైనికుల ఇంటికి ఫోన్ వచ్చినట్టుగా నాకూ ఫోన్ వచ్చింది. మానాన్న మిత్రుడు ఒకాయన కాల్ చేసి ‘‘రాహుల్ ఒక చెడు వార్త’’ అన్నారు. ‘‘నాకు తెలుసు నాన్న చనిపోయారు కదా’’ అన్నాను. ‘‘అవును’’ అన్నారు ఆయన. థ్యాంక్సు చెప్పి ఫోన్ కట్ చేశాను నేను. నేనేమంటున్నానంటే, హింసను కోరుకునే వాళ్లు, హింసను ప్రేరేపించేవాళ్లు, మోదీ గానీ, అమిత్ షా, అజిత్ థోవల్ గానీ, ఆర్సెసెస్ గానీ వీళ్లెవరికీ ఆ బాధ తెలియదు. వాళ్లు నొప్పిని అర్థం చేసుకోలేరు. మేము అర్థం చేసుకోగలం. పుల్వామా దాడిలో అమరులైన సైనికుల బిడ్డల హృదయాలు ఎంతగా విలవిలలాడిపోయాయో నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఆ బాధను నేను అనుభవించాను కాబట్టి. ఇక్కడ కాశ్మీర్‌లో ప్రజలు చనిపోతున్నప్పుడు వాళ్లెంతగా అల్లాడిపోతారో, వారిళ్లలోకి ఫోన్‌లు వస్తున్నప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నా చెల్లెలు అర్థం చేసుకోగలదు.
నిన్న ఒక జర్నలిస్టు నన్ను అడిగారు యాత్ర ముఖ్య లక్ష్యం ఎంటీ అని?. ఈ యాత్ర ద్వారా మీరేం సాధించాలనుకుంటున్నారు? ఈ జమ్ము కాశ్మీర్‌లో ఏం సాధిద్దామనుకుంటున్నారు? అని. నేను ఇప్పుడు చెప్పను రేపు సభలో చెబుతాను అన్నాను. ఆర్మీదీ కావచ్చు, సీఆర్‌పీఎఫ్‌లది కావచ్చు, కాశ్మీరీల ఇంటికి ఫోన్ కావచ్చు, ఏ ఇంటి ఫోన్ కాల్ అయినా సరే ఆ కాల్‌ను బంద్ చేయించడమే యాత్ర లక్ష్యం. ఏ తల్లికీ, ఏ బిడ్డకి, ఏ అక్కకి ఈ ఫోన్ కాల్ తీసుకునే పరిస్థితి రాకూడదు. ఈ ఫోన్ కాల్ ని ఆపేయడమే నా లక్ష్యం.
బీజేపీ, ఆర్సెస్సెస్ వాళ్లు దేన్నీ ఆక్రమిస్తున్నారు? నన్ను తిడతారు. దానికి నేను వాళ్లకి కృతజ్ఞతలు చెబుతాను. ఎందుకంటే నేను మీకు ఏదైతే ఆ శివుని గురించి చెప్పానో, శూన్యం గురించి చెప్పానో దాన్ని భావాన్ని నేను అర్థం చేసుకుంటాను. వాళ్లు నన్నెంత తిట్టినా, వాళ్లు నామీద ఎంతటి ఒత్తిడిని పెట్టినా, వాళ్లు నన్ను ఏమన్నా ప్రతి దాన్నుండి నేను నేర్చుకుంటాను. అందుకే నేను వారికి కృతజ్ఞతలు చెబుతాను.
మొదటిగా నేను మీకు ఎవరిగురించైతే చెప్పానో, ఆ శంకర్ భగవాన్ కావచ్చు, కేరళలోని నారాయణ్ గురు కావచ్చు, శూన్యం గురించి వైష్ణవ్‌జంతో గురించి, కర్నాటక లోని బసవ కావచ్చు, తమిళనాడులోని కవి తిరువాళ్లూర్ కావచ్చు, మహారాష్ట్రలోని పూలే కావచ్చు, కాశ్మీరియత్ కావచ్చు, వీళ్లందరి ఆలోచనా విధానంపై దాడి చేస్తున్నారు. ఈ ఆలోచన ఈ దేశ పునాది. మీరు, నేను, మనమంతా చేసింది ఈ ఆలోచనా విధానాన్ని రక్షించడం కోసమే. అదే ఈ యాత్ర లక్ష్యం కూడా.
నేనిపని నాకోసం చేయలేదు. ఇలాంటి పని నాకోసం నేనెప్పుడూ చేయను. బహుశా నేనిపుడు చెప్పేది నా కాంగ్రెస్ మిత్రులకు నచ్చకపోవచ్చు. కానీ నేనీపని నాకోసం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కోసం కూడా చేయలేదు. నేనీపనిని ఇక్కడున్న వీళ్లందరు కూడా హిందుస్థాన్‌లో ఉన్న ప్రజలందరి కోసం చేశారు. ఎవరైతే ఈ ఆలోచనా విధానాన్ని, దేశ పునాదుల్ని పెకిలించాలని చూస్తున్నారో, ఆక్రమించాలని చూస్తున్నారో వాళ్లకి వ్యతిరేకంగా నిలబడదాం. మనమంతా కలిసి నిలబడదాం. కానీ ద్వేషంతో కాదు, ఎందుకంటే అది మన స్వభావం కాదు. మనం ప్రేమతోనే వాళ్లకి వ్యతిరేకంగా నిలబడదాం.మనం ప్రేమతో నిలబడితే, ప్రేమగా మాట్లాడితే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామని నేను నమ్ముతాను. వాళ్ల ఈ ఆలోచనా విధానాన్ని, ఆ వైఖరినీ కేవలం ఓడిరచడమే కాదు, వాళ్ల మెధళ్లలోనుంచి, మనస్సులోంచి కూడా తీసిపారేద్దాం. మీరంతా ఈ దేశ ప్రజలు. మాకు మద్దతుగా నిలిచారు. బీజేపీ మనకు వారి జీవిత విధానాన్ని, రాజనీతిని చూపించారు. మనం ఇంకో విధానం, హిందుస్థాన్ జీవన విధానం, ప్రేమతో కూడిన జీవన విధానాన్ని చూపించే ప్రయత్నం చేస్తాం. అది ఈ దేశ ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాం. మేము ఈ దేశానికి గుర్తుచేస్తాం. హిందుస్థాన్ ప్రేమగల దేశం. సహోదర భావం కలిగిన దేశం. అందుకే మేము మీకు మొదట్లోనే చెప్పినట్లుగా ఇది మాదొక చిన్న ప్రయత్నం. అంతపెద్ద పనేం కాదిది. ఒక చిన్న ముందడుగు. ద్వేషం నిండిన మార్కెట్‌లో ప్రేమను పంచే ఒక చిన్న దుకాణం తెరిచే ప్రయత్నం చేశాం.
ధన్యవాదములు….జై హిందు..!