నో బాల్ ఇచ్చినందుకు.. అంపైర్‌ను క‌త్తితో పొడిచి చంపిన ప్లేయ‌ర్

ఓ క్రికెటర్ దారుణానికి పాల్ప‌డ్డాడు. నో బాల్ (No Ball) ఇచ్చిన అంపైర్‌ను క్రికెట్ స్టేడియంలోనే క‌త్తితో పొడిచి చంపాడు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని క‌ట‌క్ జిల్లాలో ఆదివారం వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ట‌క్ జిల్లాలోని మన్హిసలంద గ్రామంలో ఆదివారం నాడు శంకర్‌పూర్‌, బెర్హంపూర్‌కు చెందిన అండర్-18 క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మహిలాంద ప్రాంతానికి చెందిన లక్కీ రౌత్‌(22)అంపైర్‌గా వ్యవహరించాడు. అయితే జ‌గ్ రౌత్ అనే యువ‌కుడు బౌలింగ్ చేస్తున్నాడు. అత‌ను వేసిన బాల్‌ను నో బాల్ అని అంపైర్ పేర్కొన్నాడు. దీంతో అంపైర్, ప్లేయ‌ర్ మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. క్రికెట్ గ్రౌండ్‌లోనే అంపైర్‌ను జ‌గ్ రౌత్ క‌త్తితో పొడిచి చంపాడు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా గ్రామంలో పోలీసులు భారీగా మోహ‌రించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Leave a Reply

%d bloggers like this: