ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన ఓ మహిళ అత్యంత కర్కశంగా వ్యవహరించింది.. తన రెండు నెలల పసికందును గొంతు నులిమి చంపేసింది.. అనంంతరం ఏమీ తెలియనట్టు నాటకం ఆడింది.. పోలీసులను తప్పుదోవ పట్టించింది.. చివరకు పోలీసుల ఎదుట నిజం అంగీకరించి కటకటాల పాలైంది.. విచారణలో ఆమె చెప్పిన విషయం విని పోలీసులు కూడా షాకయ్యారు. పూంచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నయీ బస్తీకి చెందిన రెండు నెలల పాప తప్పిపోయినట్టు ఆదివారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సుమారు 28 గంటల తర్వాత ఇంటి వెనుక కాలువలో శిశువు మృతదేహాన్ని గుర్తించారు. హత్య కేసుగా నమోదు చేసుకుని ఆ శిశువు తల్లిని విచారించడం ప్రారంభించారు. ఆదివారం తాను బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే లోపు ఇంట్లో పాప కనిపించకుండా పోయిందని తల్లి చెప్పింది. ఆ తర్వాత తన బిడ్డను పిల్లి ఎత్తుకెళ్లిందంటూ కట్టుకథ అల్లింది. ఒకదానికొకటి పొంతన లేకుండా ఆ మహిళ చెబుతున్న సమాధానాలు పోలీసులకు అనుమానం కలిగించాయి. దీంతో పోలీసులు తమదైన స్టైల్లో ఆమెను విచారించడంతో అసలు విషయం బయటపడింది. తన కుమార్తెను తానే హత్య చేసినట్టు ఆమె అంగీకరించింది. పేదరికం కారణంగా కూతురిని పెంచి పోషించలేమనే భయంతోనే చంపేసినట్టు మహిళ తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు.
రెండు నెలల పసికందును కిరాతకంగా చంపేసిన తల్లి
