ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన నాల్గవ అనుబంధ ఛార్జిషీట్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరును చేర్చారు. అయితే.. నిందితుడిగా మాత్రం కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా మారిన అప్రూవర్ దినేష్ అరోరా వాంగ్మూలంతో కేజ్రీవాల్ పేరును ఈడీ అధికారులు ఛార్జిషీట్ లో పొందుపర్చారు. చార్జ్ షీట్‌లో సంజయ్ సింగ్ పేరును కూడా చేర్చారు. 2025లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం దినేష్ అరోరా ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియాకు రూ.82 లక్షలు ఇచ్చారని ఈడీ పేర్కొంది. మొదట్లో దినేష్ అరోరా.. సంజయ్ సింగ్‌ను కలిశాడని, అతని ద్వారా మనీష్ సిసోడియాను తన రెస్టారెంట్ అయిన ‘అన్‌ప్లగ్డ్ కోర్ట్‌యార్డ్’లో ఒక పార్టీ సందర్భంగా పరిచయమయ్యాడని ఛార్జిషీట్ లో పేర్కొన్నారు ఈడీ అధికారులు. తాను సిసోడియాతో ఐదు, ఆరు సార్లు మాట్లాడానని, సంజయ్ సింగ్‌తో పాటు కేజ్రీవాల్ నివాసంలోనూ ఒకసారి కలిశానని అరోరా చెప్పిన విషయాలను ఛార్జిషీట్ లో వివరించారు ఈడీ అధికారులు.
For More News Click: https://eenadunews.co.in/
తాను ఆప్‌కి చెందిన విజయ్ నాయర్‌ని కూడా అతని రెస్టారెంట్‌లో కలిశానని, అక్కడ తాము సెల్ ఫోన్ నంబర్లు తీసుకున్నామని అరోరా చెప్పిన విషయాలను ఈడీ అధికారులు ఛార్జిషీట్ లో పేర్కొన్నారు. 2021, ఏప్రిల్ నెలలో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ గురించి చర్చించడానికి సివిల్ లైన్స్‌లోని ఒబెరాయ్ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి అరోరాను విజయ్ నాయర్ ను పిలిచారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. అరోరాను గౌరీ అపార్ట్‌మెంట్‌కు కూడా నాయర్ ఆహ్వానించాడని తెలియజేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఈడీ ఒక ప్రధాన ఛార్జిషీటును, నాలుగు అనుబంధ ఛార్జిషీట్లను దాఖలు చేసింది.