ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెలుగు రాష్ట్రాలనే కాదు.. యావత్ దేశాన్నే కదిలిస్తోంది. ఇదే కేసులో మన పొరుగు రాష్ట్రం ఏపీకి చెందిన వైఎస్ఆర్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. దీంతో ఏపీలో కూడా దీనిపై చర్చ సాగుతోంది. వైసీఆర్ సీపీ సైతం ఆచితూచి స్పందిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇప్పటి వరకు ఈ అంశంపై స్పందించనేలేదు.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు తెరపైకి వచ్చిన దగ్గర నుంచి బీజేపీతో పాటు కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెడుతోంది. ఇవాళ లేదా రేపో కవిత అరెస్ట్ తప్పదనే ప్రచారం చేస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై (arun pillai) బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది.సస
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ఈడీ అధికారులు శుక్రవారం మరోసారి విచారించారు. పొద్దున 11:30 గంటలకు ఏపీజే అబ్దుల్ కలాం రోడ్ లోని ఈడీ హెడ్ ఆఫీసుకు చేరుకున్న బుచ్చిబాబును అరుణ్ పిళ్లైతో కలిపి ఎంక్వైరీ చేశారు. లిక్కర్ పాలసీ తయారు చేసే సమావేశాల్లో తాను లేనని పిళ్లై చెప్తుండటంతో ఆయా హోటల్స్ నుంచి సీసీ టీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలు ఈడీ సేకరించింది. వీటిని పిళ్లై, బుచ్చిబాబుల ముందు పెట్టి క్రాస్ ఎగ్జామిన్ చేసింది. లిక్కర్ పాలసీ రూపకల్పన, హోటల్స్ లో జరిగిన సమావేశాలు, డ్రాఫ్ట్ పాలసీ ముందుగా నిందితులకు రావడం, రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారాలు, ఆధారాల ధ్వంసం సహా అనేక అంశాలపై నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసింది. లిక్కర్ పాలసీ రూపకల్పన లో పిళ్లై, బుచ్చిబాబుల వద్ద లభించిన వాట్సాప్ చాట్ ల ఆధారంగా జవాబులు రాబట్టింది. శనివారం వైఎస్సార్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులును ఈడీ విచారించనుంది.
విచారణకు రండి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరుకావాలని వైఎస్సార్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులకు తొలిసారి ఈడీ నోటీసులు పంపింది. ఈ అంశాన్ని ఇటీవల రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు ముందు ఈడీ వెల్లడించింది. శనివారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది. అలాగే, 20న హాజరుకావాలని కవితకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. దీంతో దర్యాప్తు సంస్థలు చెబుతున్న సౌత్ గ్రూప్ లోని అందరికీ ఈడీ నోటీసులు పంపినట్లైంది. అయితే, ఈడీ ముందు మాగుంట హాజరవుతారా? లేదా? అన్నది చూడాలి.
అరెస్ట్ తప్పదా..?
ఒకవేళ ముఖ్యమంత్రి కూతురును అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి..? ఈ విషయంలో కేసీఆర్ తర్వాత స్టెప్ట్ ఏంటి..? ఎప్పటి నుంచో కేంద్రాన్ని ఢీకొంటున్న కేసీఆర్.. మరింత రెచ్చిపోనున్నారా..? ప్రతిపక్ష పార్టీల అధినేతలను, బీజేపీని వ్యతిరేకిస్తున్న నాయకులను కలుపుకొని వెళ్తారా..? ఇప్పటికే పలు కేసుల్లో అరెస్ట్ అయిన వారితో, విచారణను ఎదుర్కొంటున్న వారితో మాట్లాడే భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తారా..? అనే చర్చలు సాగుతున్నాయి. మరీ దీనిపై బీజేపీ, కాంగ్రెస్ ఎలా స్పందిస్తాయో చూడాలి. ప్రస్తుతానికైతే అన్ని పార్టీలు ఈ విషయాన్ని చాలా నిశితంగా.. చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ప్రెస్ మీట్లలో ఇదే అంశంపై ఎలా మాట్లాడాలనే దానిపైనా ఒకటికి, పది సార్లు చర్చించిన తర్వాతే నాయకులు స్పందించనున్నారని తెలుస్తోంది. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూలో ఏది పడితే అది మాట్లాడి పరువు పొగొట్టుకోవడం కంటే అన్ని తెలుసుకున్న తర్వాతే స్పందించాలని భావిస్తున్నారు.