ఎట్టకేలకు అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్ట్‌

ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్‌ పంజాబ్‌ దే సంస్థ వ్యవస్థాపకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ను (Amritpal Singh) పంజాబ్‌ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. గత నెల నుంచి అమృత్‌ పాల్‌ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. పంజాబ్‌లోని మోగా జిల్లాలోని ఓ గురుద్వారా వద్ద ఉన్న అమృత్‌పాల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. జాతీయ భద్రత చట్టం అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అతన్ని అసోంలోని డిబ్రూగఢ్‌ జైలుకు తరలించనున్నట్లు వెల్లడించారు. అమృత్‌పాల్‌ అరెస్టు నేపథ్యంలో ప్రజలందరు శాంతిభద్రతలు పాటించాలని సూచించారు. ఎలాంటి ఫేక్‌ న్యూస్‌ సృష్టించొద్దని కోరారు. అమృత్‌పాల్‌ సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్‌ సింగ్‌ను పంజాబ్‌ పోలీసులు ఓ కిడ్నాప్‌ కేసులో అరెస్టు చేశారు.

అరెస్టుకు వ్యతిరేకంగా అమృత్‌ పాల్‌ పిలుపు మేరకు ఫిబ్రవరి 24న పెద్ద సంఖ్యలో యువత అమృత్‌సర్‌ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్‌స్టేషన్‌పై దాడిచేశారు. అల్లర్లను ప్రోత్సహిస్తూ.. యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అమృత్‌పాల్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. పోలీసులు అరెస్టు చేస్తారని వేషాలు మార్చుకుంటు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంటున్నారు. పంజాబ్‌ పోలీసులతోపాటు ఇంటెలిజెన్స్‌ వర్గాలు సైతం గాలింపు ముమ్మరం చేశాయి. దాదాపు 37 రోజుల తర్వాత అతడు పోలీసులకు చిక్కాడు. అమృత్‌పాల్‌ను ఖలిస్థానీ వేర్పాటువాదిగా, పాక్‌ ఏజెంట్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉండగా.. అమృత్‌పాల్‌ భార్య కిరణ్‌దీప్‌ కౌర్‌ లండన్‌కు పారిపోయేందుకు యత్నిస్తుండగా విమానాశ్రయం అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

%d