అమెరికాను అతలకుతలం చేస్తున్న వరదలు

అమెరికాలోని కాలిఫోర్నియాను వరదలు ముంచెత్తుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. కోటిన్నర మందికిపైగా ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. రంగంలోకి దిగిన అధికారులు వరద ప్రభావ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వచ్చే 24 గంటల్లో పరిస్థితి మరింత దారుణంగా మారబోతోందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  పహారో నదిపై ఉన్న లవీ వంతెన తెగిపోయింది. ఫలితంగా శాన్‌ఫ్రాన్సిస్కో బే ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద నీరు పలు ప్రాంతాలను ముంచెత్తుతోంది. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కాలిఫోర్నియా వ్యాప్తంగా ఉరుములు, బలమైన గాలులతో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ఫలితంగా హైవేలు, వీధులు మునిగిపోయాయి.  శాంతా క్రజ్ కౌంటీలో దాదాపు 10 వేల మంది వరద ప్రభావానికి గురయ్యారు. రోడ్లపై కూలిన భారీ వృక్షాలను రెస్క్యూ సిబ్బంది తొలగిస్తున్నారు. పరిస్థితి చాలా దారుణంగా ఉందని, అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారి ఒకరు తెలిపారు. సెంట్రల్ కాలిఫోర్నియాలోని టులే నది పొంగి ఇళ్లను ముంచెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.

Leave a Reply

%d