పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి వచ్చినప్పుడు వాటి లక్షణాలను పక్కన ఉండేవారు గుర్తించడం, సరైన సమయానికి ఆస్పత్రిలో చేర్పించడం చాలా ముఖ్యం. ఒక్కో గంట ఆలస్యం అయిన కొద్దీ రోగి కోలుకునే అవకాశాలు గణనీయంగా సన్నగిల్లుతాయి. ఇలాగే ఉన్నట్టుండి స్పృహ కోల్పోయిన వ్యక్తిని కేవలం మూడు గంటల సమయంలోపే విశాఖపట్నంలోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకురావడంతో, వైద్యులు వెంటనే పరీక్షలు చేయడంతో పాటు సరైన చికిత్స అందించడంతో అతి తక్కువ సమయంలోనే ఆ రోగి పూర్తిస్థాయిలో కోలుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ సీహెచ్ విజయ్ తెలిపారు.
‘‘విశాఖపట్నం నగరానికి చెందిన సుమారు 40 ఏళ్ల వయసున్న జి.అప్పారావు ఉన్నట్టుండి స్పృహకోల్పోయారు. వాళ్ల కుటుంబసభ్యులు గమనించి, కేవలం మూడు గంటల్లోగానే కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ పరీక్షించగా, అతడి కుడి కాలు గణనీయంగా బలహీనపడినట్లు తెలిసింది. దాంతో ఎంఆర్ఐ పరీక్ష కూడా చేశాం. అందులో, ఎడమవైపు మిడిల్ సెరెబ్రల్ ఆర్టెరీ (ఎంసీఏ) దెబ్బతిన్నట్లు తేలింది. గోల్డెన్ అవర్‌లోగానే రోగిని ఇక్కడకు తీసుకురావడంతో ముందుగా పక్షవాతంస్ట్రోక్ ప్రభావాన్ని తగ్గించేందుకు థ్రాంబోలిటిక్ ఏజెంట్ ఇంజెక్షన్ ఇచ్చాం. దాంతో రోగిలో కొద్దిపాటి మెరుగుదల కనిపించింది. వెంటనే ఆయనను క్యాథ్‌ల్యాబ్‌కు తరలించి, అక్కడ కన్సల్టెంట్ న్యూరో, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టు డాక్టర్ వెంకటేష్ పోతుల ఆధ్వర్యంలో మెకానికల్ థ్రాంబెక్టమీ అనే ప్రక్రియ ద్వారా మెదడులోని రక్తనాళాల్లో ఏర్పడిన గడ్డలను తొలగించాం. దాంతో రోగి 24 గంటల వ్యవధిలోనే పూర్తిస్థాయిలో కోలుకున్నారు. 5 రోజుల పాటు చిన్న చిన్న వైద్య పరీక్షలు, తదుపరి చికిత్సలు అందించి, ఆయనను డిశ్చార్జి చేశాం’’ అని డాక్టర్ విజయ్ వివరించారు.