సాంకేతిక యుగంలోనూ భార్యాభర్తలిద్దరూ కలిసి అనాగరిక చర్యకు పాల్పడ్డారు. మూఢనమ్మకంతో ఆ ఇద్దరు తమ తలలను తామే నరుక్కున్నారు. ఈ దారుణ ఘటన గుజరాత్( Gujarat )లోని రాజ్‌కోట్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రాజ్‌కోట్‌కు చెందిన హేముభాయ్ మక్వానా(38), అతని భార్యా హన్సాబెన్(35) కలిసి గ్రామంలోని తమ ఇంటిని ఏడాది క్రితం వదిలేశారు. తమ పొలంలోనే ఓ గుడిసెను నిర్మించుకున్నారు. అక్కడే ఏడాది కాలంగా పూజలు చేస్తున్నారు. అయితే శనివారం రాత్రి ఆ గుడిసె ముందు హోమగుండం నిర్వహించారు. దాని ముందు పూజలు కూడా చేశారు. అయితే తమ ప్రాణాలను బలి ఇచ్చేందుకు ముందుగానే ఆ దంపతులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఓ పదునైన ఆయుధాన్ని తాడుతో కట్టి.. హోమగుండం ముందు పెట్టారు. హోమం ముగిసిన తర్వాత భార్యాభర్తలిద్దరూ సరిగ్గా ఆ పదునైన ఆయుధం కింద తల భాగాలను ఉంచారు. చేతులతో తాడును బలంగా లాగడంతో ఆ కత్తి వారి తలలపై పడటంతో రెండు తెగిపోయాయి. హన్సాబెన్ తల హోమగుండంలో పడగా, హేముభాయ్ తల దాని పక్కనే పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ చర్యతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.