బోణి కొట్టిన గుజరాత్

ఐపీఎల్ 16వ సీజన్ ఉత్కంఠభరిత మ్యాచ్ తో ప్రారంభమైంది. చెన్నై సూపర్ కింగ్స్ తో చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ఆఖర్లో రషీద్ ఖాన్, తెవాటియా భారీ షాట్లతో టైటాన్స్ గెలుపు బోణీ కొట్టింది. 179 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.  ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 92 పరుగులు) విజృంభణంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ కు సరైన ఊపు లభించింది. సీనియర్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో చకచకా 25 పరుగులు చేశాడు.  సాహా అవుటైనా యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ తన దూకుడు కొనసాగించాడు. సాయి సుదర్శన్ 22 పరుగులు చేయగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా కేవలం 8 పరుగులకే పెవిలియన్ చేరి నిరాశపరిచాడు.  అయితే ఆల్ రౌండర్ విజయ్ శంకర్ 27 పరుగులతో ఉపయుక్తమైన పరుగులు చేసి గుజరాత్ ను విజయానికి దగ్గరగా తెచ్చాడు. విజయ్ శంకర్ అవుట్ కాగా, చివర్లో రాహుల్ తెవాటియా (15 నాటౌట్), రషీద్ ఖాన్ (10 నాటౌట్) జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో రాజ్యవర్ధన్ హంగార్గేకర్ 3 వికెట్లు తీశాడు.

Leave a Reply

%d