ఇప్పుడు సాయం చేయడం లేదు – హీరోయిన్ సమీరా

పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారు నటి సమీరారెడ్డి. తెలుగులో ‘అశోక్’, ‘జై చిరంజీవ’, ‘నరసింహుడు’ తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తన పెళ్లి విషయంలో కొందరు చేసిన విమర్శలపై క్లారిటీ ఇచ్చారు. ‘‘2014లో అక్షయ్‌తో నా పెళ్లి జరిగింది. మా ఇంటి టెర్రస్‌పైనే సింపుల్‌గా చేసుకున్నాం. నేను ప్రెగ్నెంట్ అయ్యానని, అందుకే హడావుడిగా పెళ్లి చేసుకున్నానని కొందరు విమర్శించారు. కానీ అందులో నిజం లేదు. పెద్దల అంగీకారంతోనే మా వివాహం జరిగింది” అని వివరించారు.  తొలి ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని సమీరారెడ్డి చెప్పారు. 2015లో బాబు పుట్టిన తర్వాత బరువు పెరిగానని అన్నారు. ‘‘శరీరాకృతి విషయంలో చుట్టుపక్కల వాళ్లు నన్ను కామెంట్ చేశారు. చివరికి కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా ‘మీకు ఏమైంది? ఇది మీరేనా?’ అని అడిగాడు. వాళ్ల విమర్శలు నన్ను ఎంతో భయపెట్టాయి” అని అన్నారు. ఫొటోగ్రాఫర్స్‌కు కనిపించకూడదనే ఉద్దేశంతో కొంతకాలం బయటికి కూడా వెళ్లలేదని చెప్పారు.
తిరిగి అభిమానులతో కనెక్ట్ అవ్వాలనుకున్నానని, అందుకు సోషల్ మీడియా సులువైన మార్గమని అనిపించిందని సమీర అన్నారు. ఇన్‌స్టాలో అకౌంట్ క్రియేట్ చేశానని, కాస్త ప్రమోట్ చేయాలని ఫిల్మ్ ఇండస్ట్రీలో స్నేహితులకు ఫోన్ చేశానని చెప్పారు. కానీ ఒక్కరు కూడా సాయం చేయలేదని, అప్పుడు బాధగా అనిపించిందని అన్నారు.

Leave a Reply

%d