పది రోజుల క్రితం ఓ వ్యక్తిని దారుణంగా చంపేసి డ్రమ్ములో కుక్కిన ఘటన ఎంతటి సంచలనం కలిగించిందో అందరికీ తెలుసు. గత నెల 22వ తేదీన చాంద్రాయణగుట్ట పోలీసులు పూరన్ సింగ్ కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే అదే నెల 25వ తేదీన సూరం చెరువులో డ్రమ్ములో శవం కనిపించగా.. విచారణ చేపట్టారు. విచారణలో అతడు బండ్ల గూడకు చెందిన పూరన్ సింగ్ అని గుర్తించారు. అయితే ఈ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దర్ని అరెస్టు చేశారు. అయితే అతడి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పహాడీషరీఫ్ పోలీసులు వెల్లడించారు.
For More News Click: https://eenadunews.co.in/
రెండో ప్రియుడి మోజులో పడి.. మొదటి లవర్‌ను వదిలించుకోవాలన్న ఓ కిలాడీ లేడీ ఎంతటి ఘాతుకానికి తెగించిందంటే.? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పూరన్‌సింగ్ అలియాస్ దీపక్(30)కి వివాహానికి ముందే బంధువైన జయాదేవితో ప్రేమాయణం కొనసాగింది. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయి.. వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. పూరన్ సింగ్.. మమత అనే యువతిని పెళ్లి చేసుకుని బండ్ల గూడకు వలస వచ్చి గప్ చుప్ బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే తనను కాకుండా.. మరొకరిని పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేకపోయింది జయాదేవి. అతడిపై కక్ష పెంచుకుంది. కాగా, లాక్ డౌన్ సమయంలో జయా దేవి తన భర్త, పిల్లలను వదిలేసి హైదరాబాద్ వచ్చేసింది. తిరిగి పూరన్ సింగ్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. అదే క్రమంలో ఇంటి సమీపంలో ఉంటున్న నజీం అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తుక్కుగూడలో వేరుగా గది తీసుకుని అతడితో సహజీవనం సాగించింది.
అయితే ఆమె రాచకార్యం గురించి పూరన్‌కు తెలిసిపోయింది. పూరన్ కు తమ మధ్య ఉన్న సంబంధం తెలిసిందని గ్రహించిన జయాదేవి, నజీమ్.. అతడిని మట్టుపెట్టాలని అనుకున్నారు. దానికి పథకం రచించి.. మరో ఇద్దరి సాయం తీసుకున్నారు. రాజేంద్ర నగర్‌లో నివసించే తమిళనాడుకు చెందిన సుగుణా రామ్‌తో పూరన్ సింగ్‌కు ఫోన్ చేసి.. బాకీగా ఉన్న డబ్బులు ఇస్తామని చెప్పి పిలిపించారు. దీంతో పూరన్ వెళ్లగా నజీం, అతని స్నేహితుడు మబీన్, జయాదేవి, అసద్‌తో కలిసి దారుణంగా కత్తితో దాడి చేసి హత్య చేశారు. అనంతరం ఆ శవాన్ని డ్రమ్ములో కుక్కి జేసీబీలో తీసుకెళ్లి సూరం చెరువులో పడేసి పరారయ్యారు. వీరిలో నజీం, సుగుణారావును పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితురాలు జయదేవి కోసం పోలీసులు వెతుకుతున్నారు.