తాను తేలిగ్గా వదులుకునే రకం కాదని బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మరోసారి నిరూపించింది. ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్‌ను బ్యాట్‌తో, బంతితో రాణించి మలుపు తిప్పింది. భారత్ విజయావకాశాలను సంక్లిష్టం చేసింది. మీర్‌పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఉదయం తన రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లా జట్టు 6 వికెట్లు కోల్పోయిన సమయానికి కేవలం 26 పరుగుల ఆధిక్యంతో ఉంది. మరో 25 పరుగుల లోపే చాప చుట్టేస్తుందని భావించిన తరుణంలో నూరుల్ (31), లిట్టన్ దాస్ (73) ఎదురుదాడికి దిగారు. తమ జట్టుకు 144 పరుగుల ఆధిక్యాన్ని ఇచ్చారు. భారత జట్టు మరోసారి తన బలహీనతను బయట పెట్టుకుంది. బంగ్లాదేశ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఫస్ట్ ఇన్నింగ్స్ 227 పరుగులను కలుపుకొని భారత్‌కు 144 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో దాటిగా ఆడి 314 పరుగులు చేసిన భారత్.. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఇట్టే చేధిస్తుందని అభిమానులు భావించగా.. మూడో రోజు చివరి సెషన్‌లో బంగ్లాదేశ్ స్పిన్నర్లు మరోసారి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. 12 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత టాప్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్ (2), ఛటేశ్వర్ పుజారా (6), శుభ్‌మన్ గిల్ (7), విరాట్ కోహ్లీ (1) తక్కువ స్కోరు చేసి పెవిలియన్ చేరారు. ప్రస్తుతం మూడో రోజు ఆట నిలిచే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. భారత్ విజయానికి మరో 100 పరుగులు కావాల్సి ఉండగా.. బంగ్లాదేశ్ విజయానికి మరో 6 వికెట్లు కావాలి. సమయంతో నిమిత్తం లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. స్పిన్నర్లకు అనుకూలంగా మారిన పిచ్‌పై ఏం జరుగనుందో ఇక నాలుగో రోజు ఉదయం వరకూ వేచి చూడాల్సిందే. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన అక్షర్ పటేల్ 26 పరుగులు (54 బంతుల్లో) చేశాడు. ప్రస్తుతం నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన జయదేవ్ ఉనద్కత్ (3*).. ఆక్షర్‌తో పాటు కలిసి క్రీజులో ఉన్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్ 3 వికెట్లు తీశాడు. షకీబ్ అల్ హసన్ ఒక వికెట్ తీశాడు.
మళ్లీ వదిలేశారు
