తొలివన్డే ఇండియాదే

లక్ష్యం చిన్నదే. కానీ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై బ్యాటర్లు తడబడ్డారు. స్వల్ప లక్ష్యాన్ని ఊదేస్తారనుకుంటే టపటపా వికెట్లు రాలిపోవడంతో అభిమానులు భయపడ్డారు. ఓటమి తప్పదేమోనని భయపడ్డారు. అయితే, సరిగ్గా అప్పుడే అద్భుతం జరిగింది. టెస్టుల్లో ఫామ్ కోల్పోయి పరుగుల కోసం నానాతంటాలు పడుతున్న కేఎల్ రాహుల్(KL Rahul) ఈసారి జట్టుకు ఆపద్బాంధవుడయ్యాడు. క్రీజులో పాతుకుపోయి ఆసీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యిలా మారాడు. అతడికి రవీంద్ర జడేజా(Ravindra Jadeja) రూపంలో అండ దొరికింది. అంతే.. ఇద్దరూ కలిసి ఆసీస్(Australia) బౌలర్లను కంగారెత్తించారు. ఫలితంగా ముంబై వన్డేలో 39.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. వీరిద్దరి జోడీని విడగొట్టేందుకు ఆసీస్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చివరికి ఓటమి తప్పలేదు.

189 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా(Team India)కు ఏమాత్రం కలిసి రాలేదు. 5 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోవడం, ఆ తర్వాత 16 పరుగులు వద్ద మాజీ సారథి విరాట్ కోహ్లీ (4) పెవిలియన్ చేరడంతో అభిమానులు కీడు శంకించారు. ఆదుకుంటాడనుకున్న సూర్యకుమార్ యాదవ్ (0) డకౌట్ కావడం, క్రీజులో నిలదొక్కుకున్న సమయంలో శుభమన్ గిల్ (20) పెవిలియన్ చేరడంతో ఇక భారత్ పనైపోయిందని అందరూ ఫిక్సయ్యారు.

అయితే, రాహుల్‌కు జడేజా తోడయ్యాక ఆటలో క్రమంలో మార్పు వచ్చింది. ఇద్దరూ క్రీజును అంటిపెట్టుకుని పరుగులు రాబట్టి జట్టును విజయం వైపుగా నడిపారు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ వన్డేల్లో 13వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తయ్యాక రాహుల్ మరింత జోరు పెంచాడు. ఓ సిక్స్‌తో అలరించాడు. మొత్తంగా 91 బంతుల్లో 7 ఫోర్లు సిక్సర్‌తో 75 పరుగులు చేశాడు. మరోవైపు, రాహుల్‌‌కు చక్కని సహకారం అందిస్తూ వచ్చిన జడేజా 69 బంతుల్లో 5 ఫోర్లతో 45 పరుగులు చేశాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని విడగొట్టలేకపోయిన ఆస్ట్రేలియా అందుకు మూల్యం చెల్లించుకుంది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీసుకోగా, మార్కస్ స్టోయినిస్ 2 వికెట్లు తీసుకున్నాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూలింది. మహమ్మద్ షమీ, సిరాజ్ బౌలింగ్ దెబ్బకు కంగారూల బ్యాటింగ్ కకావికలమైంది. క్రీజులోకి వచ్చిన వారు వచ్చినట్టే వెనుదిరిగారు. అయితే, మిచెల్ మార్ష్ మాత్రం పోరాడాడు. 65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో భయపెట్టి 81 పరుగులు పూర్తి చేశాడు. అతడి తర్వాత జోష్ ఇంగ్లిష్ చేసిన 26 పరుగులే రెండో అత్యధికం. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 22, లబుషేన్ 15 పరుగులు చేశారు. జట్టులో ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ దాటలేకపోయారు. భారత బౌలర్లలో షమీ, సిరాజ్ రెండేసి వికెట్లు తీసుకోగా, జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు.

Leave a Reply

%d bloggers like this: