డాక్టర్ రాలేదని నర్సు సిజేరియన్ ఆపరేషన్.. శిశువు మృతి!

తెలంగాణలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జనగామ జిల్లాకు చెందిన ఓ మహిళకు పురిటినొప్పులు మొదలైన సమయంలో డాక్టర్ అందుబాటులో లేక స్టాఫ్ నర్సు సిజేరియన్ ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో శిశువు మృతి చెందడంతో బాధితులు ఆసుపత్రి వద్ద నిరసనకు దిగారు. జిల్లాలోని పాలకుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. దర్దెపల్లి గ్రామానికి చెందిన కన్నెబోయిన స్రవంతికి బుధవారం పురిటినొప్పులు మొదలవడంతో కుటుంబసభ్యులు ఆమెను పాలకుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాధారణ కాన్పు అని సిబ్బంది చెప్పడంతో వారు అక్కడే ఉండిపోయారు.

మరోవైపు, యువతికి అర్ధరాత్రి నొప్పులు తీవ్రమయ్యాయి. ఆ సమయంలో డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ అక్కడ లేకపోవడంతో స్టాఫ్ నర్సు సరిత, ఇతర సిబ్బంది సాయంతో మహిళకు సిజేరియన్ చేయగా ఆడ శిశువు జన్మించింది. అయితే, బిడ్డలో చలనం లేకపోవడంతో వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే శిశువు మృతి చెందినట్టు అక్కడి వైద్యులు ప్రకటించారు.

నర్సు సిజేరియన్ చేయడం వల్లే బిడ్డ మృతి చెందిందంటూ గురువారం బాధితులు పాలకుర్తిలో ఆసుపత్రి వద్ద ప్రజాసంఘాలతో కలిసి ధర్నాకు దిగారు. వైద్యురాలు, స్టాఫ్ నర్సును విధుల నుంచి తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య విధాన పరిషత్ పర్యవేక్షకుడు బాధితులతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శిశువు తండ్రి ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించడంతో బాధితులు ఆందోళన విరమించారు.

Leave a Reply

%d