నేటి నుండే ఐపీఎల్

క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంతా మాజాకు సమయం ఆసన్నమైంది. వన్డేలు, టెస్ట్ మ్యాచ్ లు చూసి విసిగిపోయిన వారికి పొట్టి కప్పుతో చిల్ చేయడానికి రెడీ అయ్యారు అంతర్జాతీయ క్రికెటర్లు. పది ఫ్రాంచైజీలు.. 12 వేదికలు.. 74 మ్యాచ్‌లు.. దాదాపు 60 రోజులు.. ప్రపంచ క్రికెట్‌ ప్రేమికులకు కావాల్సినంత వినోదమిక. ఈ ఏడాది చివర్లో భారత్‌లోనే జరిగే వన్డే ప్రపంచకప్‌ మెగా టోర్నీకి ముందే మరో భారీ పరుగుల పండుగ ఇది. అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌కు అంతా సిద్ధమైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య నేడు (శుక్రవారం) జరిగే మ్యాచ్‌ ద్వారా ఈ ధనాధన్‌ పోరు ఆరంభం కానుంది. ఇప్పటిదాకా జాతీయ జట్టులో సహచరులుగా కలిసి ఆడిన వారే ఇక ప్రత్యర్థులుగా మారి సవాల్‌ విసురుకోబోతున్నారు. అటు ఫ్యాన్స్‌ కూడా తమ ఫ్రాంచైజీల వారీగా విడిపోయి విదేశీ ఆటగాళ్లకు సైతం మద్దతు పలికేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాది డిసెంబరులో జరిగిన వేలం ద్వారా పది జట్లు కొత్త రూపును సంతరించుకున్నాయి. చెన్నైకి ఆడిన సామ్‌ కర్రాన్‌ను ఏకంగా రూ.18.50 కోట్లకు పంజాబ్‌ తీసుకోగా.. స్టోక్స్‌ రూ.16.25 కోట్లకు చెన్నైకి వచ్చాడు. ఇక సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా ఉన్న విలియమ్సన్‌ గుజరాత్‌ బ్యాటర్‌గా మారాడు. పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమైనా.. ఏమాత్రం కళ తప్పని ఈ లీగ్‌లో స్టార్‌ ప్లేయర్లతో పాటు యువతరం కూడా తమ స్థాయి ప్రదర్శనతో ముగ్ధులను చేయబోతున్నారు. కాగా ప్లే ఆఫ్‌లు, ఫైనల్‌ మ్యాచ్‌ తేదీలను తర్వాత ప్రకటిస్తారు.

గ్రూప్‌ ఎ

ముంబై, కోల్‌కతా, రాజస్థాన్‌, ఢిల్లీ, లఖ్‌నవూ

గ్రూప్‌ బి

చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, పంజాబ్‌, గుజరాత్‌

పది జట్లను రెండు భాగాలుగా చేసి మ్యాచ్‌లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. క్రితంలాగే ప్రతి జట్టూ లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లు ఆడుతుంది. అయితే ఈసారి స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ప్రతీ జట్టు తమ గ్రూపులోని నాలుగు జట్లతో ఒక్కోసారి, అవతలి గ్రూప్‌లోని అయిదు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటోలో ముంబై సారథి రోహిత్‌ శర్మలేక పోవడం చర్చనీయాంశమైంది. అయితే స్వల్ప అస్వస్థత కారణంగా అతను అహ్మదాబాద్‌ రాలేకపోయాడని, ఏప్రిల్‌ 2న జరిగే తొలి మ్యాచ్‌నాటికి సిద్ధమవుతాడని సమాచారం.

Leave a Reply

%d bloggers like this: