అతడు ఎక్కడో ఇరాక్ దేశంలో పుట్టాడు. అక్కడ చదువుకుంటున్నాడు. కానీ, శారీరకంగా ఉన్న అవకరం అతడిని మానసికంగా కుంగదీస్తోంది. తమ సొంత దేశంలో దానికి చికిత్స లేదు. వేరే పెద్ద దేశాలకు వెళ్దామంటే ఖర్చు భరించేంత స్థోమత లేదు. 20 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత అతడికి హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రి గురించి తెలిసింది. రెక్కలు కట్టుకుని వాలిపోయాడు. ఇరాన్‌కు చెందిన సజ్జాద్ అమీన్ మత్రూద్ అల్ హస్నవి అనే 20 ఏళ్ల యువకుడికి పుట్టుకతోనే కాళ్లు వంకరగా ఉన్నాయి. (వీటినే దొడ్డికాళ్లు అంటాం). వయసుతో పాటే ఈ సమస్య కూడా చాలా తీవ్రంగా పెరుగుతూ వచ్చింది. దాంతో నడవడం కూడా అతడికి చాలా కష్టమైపోయింది. దొడ్డికాళ్ల సమస్య చాలామందిలో కనిపించినా, ఇతడికి వచ్చినది మాత్రం అత్యంత అరుదు. లక్ష మందిలో ఒకరికే వచ్చే అరుదైన జన్యుపరమైన లోపం. దీన్ని వైద్య పరిభాషలో ఎపిఫిజియల్ డిస్‌ప్లేసియా విత్ సివియర్ జిను వల్గస్ డిఫార్మిటీ అంటారు. జన్యుపరమైన లోపాల కారణంగా ఈ సమస్య వస్తుంది. ఇందులో కాస్త తక్కువ తీవ్రతతో ఉండే అవకరం అయితే వయసుతో పాటే నయమైపోతుంది. చాలా కొద్దిమందికి మాత్రం అత్యంత తీవ్రమైన వైకల్యాలు వస్తాయి. దీనివల్ల వీరికి కాళ్లు పొట్టిగా అయిపోవడం, జీర్ణవ్యవస్థ అసాధారణంగా ఉండటం, రోజువారీ జీవక్రియలకు కూడా ఇబ్బంది కలగడం లాంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలతో అతడు హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వచ్చాడు. అతడికి అందించిన వైద్యం, చేసిన శస్త్రచికిత్సల వివరాలను కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ కాషా వివరించారు.
‘‘రెండు మూడు నెలల వ్యవధిలో అతడికి రెండుసార్లు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. దీన్ని కంప్యూటర్ నేవిగేటెడ్ ఎక్స్‌టర్నల్ ఫిక్సేటర్ (టేలర్ స్పేషియల్ ఫ్రేమ్) అంటారు. సంప్రదాయ పద్ధతుల్లో చేసే శస్త్రచికిత్సల కంటే వీటివల్ల అత్యంత కచ్చితంగా చేయడానికి వీలవుతుంది. దాంతో క్రమంగా ఇతడికి ఉన్న అవకరం మొత్తం నయమై కాళ్లు సాధారణ స్థితికి తిన్నగా వస్తాయి. ఒకవేళ ఇలాంటి శస్త్రచికిత్స చేయకుండా వదిలేస్తే, మోకాళ్లు క్రమంగా అరిగిపోతాయి, చివరకు చిన్నవయసులోనే మోకాలిచిప్ప మార్పిడి కూడా చేయించుకోవాల్సి వస్తుంది. ఇతడికి వంకర కాళ్లకు శస్త్రచికిత్స చేసేటప్పుడే కాలు పొట్టిగా అయిన సమస్యనూ ఒకేసారి పరిష్కరించాము. ఇప్పుడు సజ్జాద్ అమీన్ తన సొంతకాళ్ల మీద శరీర బరువు అంతటినీ మోపి చక్కగా నడవగలుగుతున్నాడు. కాలి పొడవు కూడా సాధారణ స్థితికి వచ్చింది. అమెరికా లాంటి పెద్ద దేశాల్లో చేయాలంటే ఈ చికిత్సకు దాదాపు 20-30 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ ఇక్కడ అందులో దాదాపు నాలుగోవంతుతోనే అతడికి మొత్తం నయమైంది. చిన్నతనంలోనే చేస్తే ఇన్నాళ్లు బాధపడాల్సి వచ్చేది కాదు. ఈ శస్త్రచికిత్సలను చిన్నవయసు వారి నుంచి పెద్దవారి వరకు ఎవరికైనా చేయొచ్చు’’ అని తెలిపారు.
కంప్యూటర్ నేవిగేషన్ ద్వారా ఇలాంటి అవకరాలను సరిచేసే శస్త్రచికిత్సలలో డాక్టర్ శ్రీనివాస్ కాషా ప్రత్యేక శిక్షణ పొందారు. ఇందులో ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఫెలోషిప్ ఉంది. ఈ పరిజ్ఞానంతో ఆయన అనేక వైకల్యాల కేసులను నయం చేశారు.