ఏపీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గుంటూరులో పార్టీ కార్యాలయం నిర్మించారు. కేసీఆర్ స్థాయి, ఆలోచనలకు అనుగుణంగా సకల సౌకర్యాలతో మంగళగిరి రోడ్డులోని ఏఎస్ కన్వెన్షన్ సెంటర్ సమీపంలో 5 అంతస్తులతో దానిని నిర్మించారు. దాని ప్రారంభోత్సవానికి సిఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. కానీ ఏ ఒక్కరూ రాలేదు! కనీసం ఏపీలో అందరికీ సుపరిచితుడైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని కూడా పంపించకపోవడం తోట చంద్రశేఖర్‌కు తల కొట్టేసిన్నట్లే అయ్యింది.
For More News Click: https://eenadunews.co.in/
దాంతో ఆయనే కొంతమంది అనుచరుల సమక్షంలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసుకొని కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఏవిదంగా తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారో చెప్పుకొచ్చి వారిని చూసి మన ఆంద్ర మంత్రులు నేర్చుకోవాలని హితవు పలికారు. గత టిడిపి ప్రభుత్వం, ఇప్పటి వైసీపీ ప్రభుత్వం రెండూ కూడా లక్షల కోట్లు పెట్టుబడులు, వాటితో అనేక పరిశ్రమలు, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పడమే తప్ప ఒక్క పరిశ్రమ రాకపోగా గత నాలుగేళ్ళలో ఉన్నవి కూడా హైదరాబాద్‌కు తరలిపోయాయని తోట చంద్రశేఖర్ విమర్శించారు. ఈ విషయాలు అందరికీ తెలిసినవే. కనుక వాటి గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి, మహారాష్ట్రలో పార్టీ శిక్షణాశిభిరం నిర్వహించడానికి విమానాలు వేసుకొని వెళ్ళే కేసీఆర్, హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న గుంటూరులో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఎందుకు మొహం చాటేశారో తోట చంద్రశేఖర్ చెప్పి ఉంటే బాగుండేది.
For More News Click: https://eenadunews.co.in/
కేసీఆర్ కనీసం తన మంత్రులనో ఎమ్మెల్యేలనో ఎందుకు పంపలేదో కూడా తెలీదు. అయితే భాష కాని భాష మహారాష్ట్రలో చక్కర్లు కొడుతున్న కేసీఆర్, ఏపీలో అడుగు పెట్టేందుకు ఎందుకు సంకోచిస్తున్నారో అందరికీ తెలుసు. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మద్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, నీళ్ళు, అప్పులు, ఆస్తుల పంపకాల విషయంలో పేచీలు పెడుతుండటం, ఏపీ రాజకీయాలలో వేలుపెట్టి ఏపీ అభివృద్ధి జరగకుండా చక్రం తిప్పడం వంటి అనేక కారణాలున్నాయి. కనుక ఏపీలో అడుగుపెట్టాలంటే వాటి గురించి ఏపీలో పార్టీలు అడిగే ప్రశ్నలకు కేసీఆర్ సంతృప్తికరమైన సమాధానాలు చెప్పుకోవలసి ఉంటుంది. అందుకే మొహం చెల్లక ఏపీలో అడుగుపెట్టలేకపోతున్నారనే అభిప్రాయం వినబడుతోంది. అయితే నందిని పందని, పందిని నందని నమ్మించగల మాటకారి అయిన కేసీఆర్ ఏదో ఓ రోజు ఈ ప్రశ్నలన్నిటికీ తనదైన శైలిలో సమాధానాలు చెపుతూ ఏపీలో అడుగుపెట్టడం ఖాయమే. బహుశః వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారేమో?