మూత్రపిండాలు మార్చాలంటే దాతకు, గ్రహీతకు ఇద్దరికీ శస్త్రచికిత్స చేయాలి. దాత నుంచి సేకరించి, గ్రహీతకు అమర్చాలి. దాత కూడా చాలాకాలం పాటు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శస్త్రచికిత్స వల్ల నొప్పి కూడా వస్తుంది, ఒంటి మీద పెద్ద పెద్ద మచ్చలు పడతాయి. అదే లాప్రోస్కొపిక్ విధానంలో కిడ్నీని సేకరించగలిగితే ఫలితం చాలా బాగుంటుంది. రాయలసీమలోనే తొలిసారిగా ఇలా లాప్రోస్కొపిక్ పద్ధతిలో దాత నుంచి కిడ్నీసేకరించి గ్రహీతకు అమర్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన యూరాలజిస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు.
‘‘ఇలా చేయడం నిజానికి చాలా సంక్లిష్టం. శస్త్రచికిత్స చేసి, చేత్తో కిడ్నీ తీయడం చాలా కాలంగా ఉంది. ఆ విధానంలో ఒక పక్కటెముకను కత్తిరిస్తాం. లోపల కండరాలను కూడా కత్తిరించి, అప్పుడు రక్తనాళాలను, మూత్రనాళాన్ని కిడ్నీ నుంచి వేరుచేసి అప్పుడు కిడ్నీని జాగ్రత్తగా బయటకు తీస్తాం. కానీ దానివల్ల శస్త్రచికిత్స తర్వాత దాతకు విపరీతమైన నొప్పి ఉంటుంది. కత్తిరించిన కండరాలను కుట్టాలి. ఆ గాయాలు తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని.. భర్తకు కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చిన భార్యకు లాప్రోస్కొపిక్ పద్ధతిలో కిడ్నీ సేకరించాలని నిర్ణయించాం. కర్నూలు జిల్లాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి చాలాకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు.
ఆయనకు తన మూత్రపిండాల్లో ఒకటి ఇచ్చేందుకు ఆయన భార్య ముందుకొచ్చారు. అన్నీ సరిపోవడంతో ఆమెకు ఇబ్బంది లేకుండా ఉండేలా లాప్రోస్కొపిక్ పద్ధతిలో కిడ్నీ తీయాలని నిర్ణయించాం. ఈ పద్ధతిలో ఎక్కడా పక్కటెముకలను, కండరాలను కత్తిరించాల్సిన అవసరం ఉండదు. కేవలం ఫేషియా అనే ఒక పొరను మాత్రం కత్తిరించి, మూత్రపిండానికి ఎలాంటి గాయం కాకుండా అత్యంత జాగ్రత్తగా సేకరిస్తాం. చుట్టుపక్కల రక్తనాళాలకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. ఉదరానికి కిందిభాగంలో చిన్నపాటి కోతల ద్వారానే సేకరిస్తాం. దీనివల్ల నొప్పి దాదాపుగా ఉండదు. ఇలా చేయడంతో దాత రెండు రోజుల్లో లేచి తిరిగి, మూడోరోజు డిశ్చార్జి కూడా అయ్యారు. కిడ్నీ ఇచ్చిన దాత 35 ఏళ్ల వయసున్న మహిళ కావడంతో శరీరం మీద ఎలాంటి మచ్చలు లేకుండా చేయగలిగాం. కేవలం 1 సెంటీమీటరుది ఒకటి, అర సెంటీమీటరువి రెండు చిన్న కోతలు మాత్రమే ఉండటం వల్ల చూడటానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ శస్త్రచికత్సలో డా. ఉమాహేశ్వరరావు, అనస్థీషీయా డాక్టర్లు శృతి మరియు భువనేశ్వరి, నెఫ్రాలజిస్ట్ డా. అనంతరావులు పాల్గొన్నారు. రాయలసీమ ప్రాంతంలోనే ఇలా లాప్రోస్కొపిక్ పద్ధతిలో మూత్రపిండం సేకరించడం ఇదే తొలిసారి’’ అని ఆయన వివరించారు.