6 రోజుల చిన్నారికి కిమ్స్ కడల్స్ లో గుండె ఆపరేషన్

మ‌హారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన దంప‌తులు, అక్క‌డ పుట్టిన కొన్ని గంటల్లోనే శ్వాసకోశ సమస్యలు, గుండె లోపాలతో బాధపడుతున్న తమ మూడు రోజుల శిశువును కొండాపూర్‌లోని కిమ్స్ కడిల్స్ ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. కిమ్స్ కడల్స్ లో ప‌లువురు నిపుణుల బృందం త‌క్ష‌ణం 12 గంటల మారథాన్ శస్త్రచికిత్స చేసి, బాలుడికి కొత్త జీవితాన్ని ఇచ్చింది.

బాలుడికి లో ఆక్సిజన్ శాచ్యురేషన్ సమస్యలు కూడా ఉన్నాయి. నాందేడ్ ప‌ట్ట‌ణంలో 39 వారాల గ‌ర్భ‌వ‌తి (పూర్తికాలం)కి ఎల‌క్టివ్ సిజేరియ‌న్ చేసిన‌ప్పుడు బాలుడిని ప్ర‌స‌వించారు. పుట్ట‌గానే శిశువు సాధార‌ణంగానే ఉన్న‌ట్లు ప్ర‌స‌వానంత‌ర స్కాన్ల‌లో తేలింది. కానీ.. సుమారు 12 గంటల త‌ర్వాత, బాబు ఊపిరి పీల్చుకోడానికి ఇబ్బంది ప‌డుతుండ‌టం, చ‌ర్మం క్ర‌మంగా నీలిరంగులోకి మార‌డం (సైనోసిస్) తో శిశువు తల్లిదండ్రులు శ్వాసకోశ బాధను గమనించారు. శ్వాసకోశ బాధ మరియు చర్మం నీలం రంగు మారడం (సైనోసిస్) తో అతన్ని ఎన్ఐసియుకు తీసుకెళ్లారు.

ప‌రిస్థితి తీవ్ర‌త దృష్ట్యా బాబును హైద‌రాబాద్ కొండాపూర్‌లోని కిమ్స్ క‌డల్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించారు. దాంతో ఎన్ఐసీయూ వైద్య‌బృందంలో చీఫ్ నియోనాటాల‌జిస్టు, నియోనాటాల‌జీ విభాగాధిప‌తి డాక్ట‌ర్ సి.అపర్ణ నేతృత్వంలో పుట్టిన మూడోరోజున బాబును కొండ‌పూర్‌లోని కిమ్స్ క‌డిల్స్ నియోనాటల్ యూనిట్‌కు నాన్‌-ఇన్వేజివ్ వెంటిలేష‌న్ మీద త‌ర‌లించారు.

బాబుకు పెద్ద టీజీఏ (ట్రాన్స్‌పొజిష‌న్ ఆఫ్ గ్రేట్ ఆర్టెరీస్‌- బృహ‌ద్ధ‌మ‌ని స‌రైన‌చోట‌ లేక‌పోవ‌డం) స‌మ‌స్య ఉంద‌ని పిల్ల‌ల గుండెవైద్య నిపుణుడు డాక్ట‌ర్ సుదీప్ వ‌ర్మ గుర్తించారు. దాంతో బాబును మెకానిక‌ల్ వెంటిలేట‌ర్ మీద పెట్టారు.

12 గంట‌ల పాటు ‘ఆర్టీరియ‌ల్ స్విచ్’ అనే శ‌స్త్రచికిత్స చేశారు. అందులో స‌రైన‌చోట లేని బృహ‌ద్ధ‌మ‌ని, ఇత‌ర ధ‌మ‌నుల‌ను గుండె కుడి, ఎడ‌మ గ‌దుల్లోని స‌రైన ప్ర‌దేశంలో పెట్ట‌డంతో పాటు ఒక పెద్ద రంధ్రం (వీఎస్‌డీ)ని కూడా పూడ్చారు. కిమ్స్ ఆస్ప‌త్రికి చెందిన సీనియ‌ర్ కార్డియాక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ అనిల్ ధ‌ర్మ‌పురం, పీడియాట్రిక్ కార్డియాక్ ఎనస్థ‌టిస్టు డాక్ట‌ర్ నాగ‌రాజ‌న్ నేతృత్వంలో జ‌రిగిన ఈ శ‌స్త్రచికిత్స సంద‌ర్భంగా ఆ బాబుకు కేవ‌లం ఒకే క‌రొన‌రీ ఆర్టెరీ (ధ‌మ‌ని) ఉంద‌ని గుర్తించారు.

“ఆర్టీరియ‌ల్ స్విచ్‌తో పాటు వీఎస్‌డీ కూడా ఉండ‌టం వ‌ల్ల మూడు రోజుల వ‌య‌సున్న బాబుకు శ‌స్త్రచికిత్స చేయ‌డానికి సాంకేతికంగా చాలా నైపుణ్యం అవ‌స‌రం, రిస్కు కూడా పెరుగుతుంది. అలాంటి ప‌రిస్థితుల్లో జ‌ఠ‌రిక కండ‌రం చాలా సున్నితంగా ఉంటుంది. దానివ‌ల్ల శ‌స్త్రచికిత్స స‌మ‌యంలో మ‌యోకార్డియం దెబ్బ‌తిని, ఫ‌లితంగా జ‌ఠ‌రిక ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ప్రాణాపాయం సంభ‌వించే ప్ర‌మాదం ఉంటుంది. ఇలాంటి సున్నిత‌మైన‌, సంక్లిష్ట శ‌స్త్రచికిత్స‌ల‌ను సాధార‌ణంగా మూడు నుంచి నాలుగు వారాల వ‌య‌సున్న పిల్ల‌ల‌కు చేస్తారు. కానీ ఇక్క‌డ మూడు రోజుల బాబుకు చేయాల్సి వ‌చ్చింది. అయితే, శ‌స్త్రచికిత్స‌లో ప్ర‌తిదీ బాగా జ‌రిగింది. శిశువుకు కొత్త జీవితాన్ని ఇవ్వ‌గ‌లిగాం. ఇలాంటి శ‌స్త్రచికిత్స‌ల‌లో రిస్కు బాగా ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి, మ‌న దేశంలో చాలా కొద్ది ఆస్ప‌త్రుల‌లో మాత్ర‌మే ఇలాంటి మార‌థాన్ శ‌స్త్రచికిత్స‌ల త‌ర్వాత విజ‌య‌వంత‌మైన ఫ‌లితం వ‌స్తుంది” అని కిమ్స్ ఆస్ప‌త్రి సీనియర్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్ ధర్మపురం అన్నారు.

కిమ్స్ క‌డల్స్ ఆస్ప‌త్రి చీఫ్ నియోనాటాలజిస్ట్, నియోనాటాలజీ విభాగాధిప‌తి డాక్టర్ సి అపర్ణ మాట్లాడుతూ “ఈ కేసులోని సంక్లిష్టత ఒకే క‌రోనరీ ధమని ఉండటం. టీజీఏ శస్త్రచికిత్సలో, క‌రోనరీ ధమనులను మార్చడం చాలా కీలకమైన దశగా పరిగణిస్తారు. మూడు ప్రధాన క‌రోనరీ నాళాలకు ఒకే మూలం ఉండటం వల్ల ఈ శిశువులో ఈ దశ మరింత క్లిష్టంగా మారింది. ఇది చాలా అరుదు, ఇది టీజీఏ కేసులలో ఏడు శాతం మాత్రమే సంభవిస్తుంది. సాధార‌ణంగా అయితే శిశువుకు కనీసం నాలుగు వారాల వయస్సు వచ్చిన తర్వాత ఇటువంటి కేసులకు ఆపరేషన్ చేస్తారు. కానీ, ప‌రిస్థితి తీవ్ర‌త దృష్ట్యా మేము చాలా త్వరగా, అంటే, బాబు పుట్టిన ఆరు రోజులకే, గుండె వైఫల్యం కారణంగా శిశువు వెంటిలేటర్‌పై ఉన్నందున శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది.

డాక్టర్ అరవింద లోచాని, డాక్టర్ ప్రణీత రెడ్డిలతో కూడిన ఎన్ఐసీయూ బృందం శిశువుకు వెంటిలేటర్ మద్దతు, పెరిటోనియల్ డయాలసిస్, రక్త మార్పిడి, యాంటీబయాటిక్స్, రక్తాన్ని ప‌ల్చ‌బ‌ర్చే మందులు, యాంటీ-కార్డియాక్ ఫెయిల్యూర్ ఏజెంట్లతో కూడిన ఇంటెన్సివ్ కేర్ ఇచ్చింది. పూర్తిగా కోలుకున్న శిశువును చివరికి డిశ్చార్జ్ చేసి నాందేడ్ పంపారు.

Leave a Reply

%d