యోగాతోనే జీవితం – శ్రీలత

మారుతున్న జీవన శైలిలో యోగా అనేది తప్పకుండా చేయాలన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ శ్రీలత. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురంలోని కిమ్స్ సవీర ఆస్పత్రిలో యోగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… శరీరాన్ని, మనస్సును ఒక గాడిలో పెట్టి, రెండింటిని సమతుల్యంలోకి తెచ్చేదే యోగ. యోగాకున్న సమగ్రత, సంపూర్ణత్వం మరే ఇతర సాధారణ వ్యాయామాలకు ఉండదు. శారీరక వ్యాయామాన్ని మించిన ప్రయోజనాలున్నందునే పాశ్చాత్య ప్రపంచం కూడా ఇప్పుడు యోగా పట్ల ఆకర్షితులవుతున్నారు. యోగాసనాల వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరం నుండి విషతుల్యాలు వేగంగా బయటకు వెళ్లిపోతాయి. అవయవాల పనితీరు బాగుంటుంది. మనసును శ్వాస ప్రక్రియపై లగ్నం చేసి, ఏకాగ్రత సాధన చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యము పెరుగుతుంది. నానా రకాల ఒత్తిళ్లలో కూరుకుపోతున్న నేటి తరానికి యోగా అత్యంత ఆవశ్యకంగా మారింది. ఎవరైతే యోగాని ప్రతి రోజు సాధన చేస్తారో అటువంటి వ్యక్తుల శరీరానికి వశ్యత ఎక్కువగా ఉంటుంది. మరియు శరీరానికి మెదడుకి మధ్య బలమైన బంధం ఏర్పరుచుకుంటుంది. చేతికి చూపుకి మధ్య సమన్వయం మెరుగుపరచడం లో యోగ సహాయపడుతుంది మరియు కీళ్ల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇందువల్ల వృద్యాప్యంలో వచ్చే కీళ్ల సమస్యలు దరిచేరవు. యోగ మీ ఎముకలను దృఢంగా శక్తివంతం చేస్తుంది.  మీ రోగ నిరోధక శక్తి పెరగటానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుంది.  నిద్రలేమిని తరిమికొట్టడానికి యోగ బాగా సహాయపడుతుంది.  రక్తపోటుని తగ్గించడానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుంది.  జీవక్రియను పెంచడంలో యోగ ఉపయోగపడుతుంది.  యోగా మీ గుండె యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది, శరీరంలోని అంతస్రావ విధులను మెరుగుపరచడంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది, శరీర నైపుణ్యాన్ని యోగ పెంచుతుంది, టైపు 2 మధుమేహం ని యోగ ప్రభావంతంగా ఎదుర్కొంటుందని తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: