బెంగుళూరుని చిత్తు చేసిన నైట్ రైడర్స్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచులో కేకేఆర్ రెచ్చిపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తు చిత్తుగా ఓడించింది. 81 పరుగుల భారీ తేడాతో విజయ భేరి మోగించింది. 205 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కేకేఆర్ స్పిన్నర్లు ఓ ఆటాడుకున్నారు. దీంతో.. ఆర్సీబీ 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌట్ అయింది. డుప్లెసిస్ (23), కోహ్లీ (21), మైకేల్ బ్రెస్ వెల్ (19), డేవిడ్ విల్లే(20) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. మ్యాక్స్ వెల్(5), దినేష్ కార్తీక్ (9), హర్షల్ పటేల్ (0), షాబాజ్ అహ్మద్ (1) విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లతో దుమ్మురేపాడు. సుయాష్ శర్మ మూడు వికెట్లతో సత్తా చాటాడు. సునీల్ నరైన్ కి రెండు వికెట్లు దక్కాయి. బ్యాటింగ్ హీరో శార్దూల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.

205 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఓపెనర్లు మంచి ఆరంభమే అందించారు. కోహ్లీ, డుప్లెసిస్ ఫస్ట్ వికెట్ కు 44 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని సునీల్ నరైన్ విడదీశాడు. 21 పరుగులు చేసిన కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక, అక్కట్నుంచి ఆర్సీబీ వికెట్ల పతనం మొదలైంది. వరుణ్ చక్రవర్తీ తన మాయజాలాన్ని ప్రదర్శించాడు. స్పిన్ తో ఆర్సీబీని బెంబేలెత్తించాడు. డుప్లెసిస్ (23), మ్యాక్స్ వెల్ (5), హర్షల్ పటేల్ (0) ను స్వల్ప విరామాల్లో క్లీన్ బౌల్డ్ చేశాడు ఆర్సీబీని కష్టాల్లోకి నెట్టాడు. మరి కొద్ది సేపటికే షాబాజ్ అహ్మద్ కూడా ఒక పరుగు మాత్రమే చేసి సునీల్ నరైన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో.. ఆ తర్వాత 61 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఆర్సీబీ.

మైకేల్ బ్రేస్ వేల్, దినేష్ కార్తీక్ ఆర్సీబీ ఇన్నింగ్స్ ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ.. వీరి ప్రయత్నాలకి శార్దూల్ ఠాకూర్ అడ్డుకట్ట వేశాడు. 19 పరుగులు చేసిన బ్రేస్ వేల్ ఠాకూర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత మళ్లీ ఆర్సీబీ వికెట్ల పతనం మొదలైంది. ఒకే ఓవర్ లో ఇంపాక్ట్ ప్లేయర్ అనూజ్ రావత్ (1), దినేష్ కార్తీక్ (9) లను ఔట్ చేసి కోలుకోలేని దెబ్బ తీశాడు యంగ్ స్పిన్నర్ సుయాష్ శర్మ. దీంతో.. 86 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో డేవిడ్ విల్లే, ఆకాష్ దీప్ కాసేపు మెరుపులు మెరిపించినా.. కేకేఆర్ స్పిన్ ముందు నిలబడలేకపోయారు. దీంతో.. ఆర్సీబీకి భారీ ఓటమి తప్పలేదు.

అంతకుముందు.. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ఓ దశలో 130 పరుగులు కూడా చేయలేదనుకున్న కోల్‌కతాకు అద్భుత స్కోరు అందించాడు లార్డ్ శార్దూల్. టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ( 29 బంతుల్లో 68 పరుగులు ; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్ ( 33 బంతుల్లో 46 పరుగులు ; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) శివతాండవం చేశారు. రహ్మనుల్లా గుర్బాజ్ (44 బంతుల్లో 57 పరుగులు ; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో డేవిడ్ విల్లే, కర్ణ్ శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. మైకేల్ బ్రేస్ వెల్, హర్షల్ పటేల్, సిరాజ్ తలా ఓ వికెట్ తీశారు.

Leave a Reply

%d