సహకార సంఘాల్లో నకిలీ పాస్ పుస్తకాలతో లక్షల రూపాయల రుణాలు స్వాహా చేస్తున్నారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం త్రిపురాపురం రెవిన్యూ పరిధిలోని గొల్లపాలెం గ్రామంలో భూ యజమానుల ప్రమేయం లేకుండా నకిలీ పాస్ పుస్తకాల సృష్టించి గుర్రపు నాయుడుపాలెం, ఫిరంగిపురం సొసైటీలో 30 లక్షలు రుణాలు పొందారు. రెవిన్యూ అధికారులు, ప్రాథమిక సహకార సంఘాల ఉద్యోగులు, చైర్ పర్సన్లు కుమ్మక్కై అక్రమంగా రుణాలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గొల్లపాలెం గ్రామంలో 44.93 భూమికి ఫిరంగిపురానికి చెందిన ఐదుగురు వ్యక్తుల పేరుపై రెవెన్యూ అధికారులు నకిలీ పాస్ పుస్తకాలు మంజూరు చేయగా, సొసైటీ అధికారులు చైర్మన్లు 30 లక్షలు తనకా రుణాలు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారని అదే గ్రామానికి చెందిన డి అంజిరెడ్డి బాధితుడు స్పందనలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణకై నూజెండ్ల తాసిల్దార్ జెట్టి మధు బాబును కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం గొల్లపాలెం రెవిన్యూ అవుకుతావకలు, గుర్రప్ప నాయుడుపాలెం సొసైటీలో అక్రమాలపై విచారణ జరుగుతుంది. త్రిపురాపురం రెవిన్యూ గ్రామ పరిధిలోని గొల్లపాలెం గ్రామం సర్వేనెంబర్ 267-1,235,234,233లో 9.16 ఎకరాలకు సంబంధించి కన్నపనేని చిన్న వెంకటనారాయణ అనే వ్యక్తి పేరు పై వినుకొండ ఐసిఐసిఐ బ్యాంక్ లో మార్ట్గేజ్ డాక్యుమెంట్ నెంబర్ : 1513/2019లో 12.40 లక్షలు తనకాలోను పొందారు. తూమ కుంట లక్ష్మి పేరుపై సర్వే నెంబర్ 247-2 లో 5 ఎకరాలకు గురమనేనిపాలెం సొసైటీలో మార్ట్ గేజ్ డాక్యుమెంట్ నెంబర్ 12177/2021లో 6 లక్షలు, ఫిరంగిపురం సొసైటీలో సర్వేనెంబర్ 241లో 3.54 ఎకరాలు, 185-1 లో 0.25 సెంట్లకు గాను మార్ట్ గేజ్ డాక్యుమెంట్ నెంబర్ 1431/2021 లో 6 లక్షలు రుణాలు పొందారు. అలాగే కోరి బాలయ్య త్రిపురాపురం రెవిన్యూ సర్వేనెంబర్ 271లో 2.71 ఎకరాలు, 274లో 3.45 ఎకరాలకు మార్ట్గేజ్ డాక్యుమెంట్ నెంబర్ 1430/2021 లో 6 లక్షలు, గున్నా కృష్ణవేణి పేరుతో త్రిపురాపురం రెవిన్యూ సర్వేనెంబర్ 236-3-1 లో 2.31 ఎకరం, 236-3-3లో 2.31 ఎకరాలకు డాక్యుమెంట్ నెంబర్ 14 29/2021 లో 6 లక్షలు అక్రమంగా తన రుణాలు పొందారు. రుణాలు పొందిన ఐదుగురు వ్యక్తులు నూజెండ్ల మండలం లేదా వినుకొండ ప్రాంతవాసులు కాదు. అంతేకాకుండా ఈ వ్యక్తులకు ఇక్కడ ఎటువంటి భూమి లేదాని, సంబంధం లేని వ్యక్తుల పేర్లతో రెవిన్యూ రికార్డులు తారుమారు చేసి ఆన్లైన్లో పేర్లు ఎక్కించి నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి సొసైటీ బ్యాంకుల్లో 30 లక్షలు రుణం పొందారని ఇందుకు నూజెండ్ల తాసిల్దార్, సొసైటీ ఉద్యోగులు, సొసైటీ చైర్ పర్సన్ లు కుమ్మక్కై రుణాలు పొంది వాటాల పద్ధతిలో పంచుకున్నారు అనేది తెలుస్తుంది. నకిలీ పాస్ పుస్తకాలు మంజూరు చేసిన రెవెన్యూ అధికారులపై, రుణాలు ఇచ్చిన సొసైటీలపై విచారణ జరిపించాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇది ఇలా ఉంటే నూజెండ్ల మండలంలోని రెండు సొసైటీలో నకిలీ పాస్ పుస్తకాలతో కోట్ల రూపాయల రుణాలు ఇచ్చి భారీ కుంభకోణం జరిగినట్లు సమాచారం. గతంలో సొసైటీ చైర్ పర్సన్ బంధువుకు 5 ఎకరాలు భూమి లేకుండానే రెండు లక్షలు లోన్ అక్రమంగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఉన్నతాధికారులు పిఎసిఎస్ సొసైటీ రికార్డులను సమగ్రంగా విచారణ చేపడితే సుమారు 30 కోట్ల రూపాయల కుంభకోణం బయటపడుతుందనే ప్రచారం జరుగుతుంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సహకార సంఘాల లో జరిగే అవినీతి అక్రమాలకు కుంభకోణాలపై విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు.
నకిలీ పాస్ పుస్తకాలతో సొసైటీలో రుణాలు
