విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా లారీల బంద్ నిర్వహించినున్నట్టు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు తెలిపారు. అఖిలపక్ష రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు విశాఖ ఉక్కు కార్మికుల పోరాటానికి సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నామని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి లారీలను ఎక్కడికక్కడే నిలుపుదల చేయాలని లారీ యజమానులకు పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 32 మంది తెలుగు ప్రజల బలిదానంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించటం బాధాకరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన వెలువడినప్పటి నుంచి ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక వర్గం 800 రోజులుగా మొక్కవోని దీక్షతో పోరాటం సాగిస్తోందని తెలిపారు. ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులకు రాష్ట్ర ప్రజానీకం అండగా ఉందన్నారు. రైతులు ఇచ్చిన 22 వేల ఎకరాల్లో నిర్మించిన ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవటం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. రాష్ట్రంలో రవాణా రంగానికి విశాఖ ఉక్కు కర్మాగారం వెన్నుముకగా ఉందని, నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి కారణంగా రోజుకు 2 వేల లారీల ఎగుమతి, దిగుమతుల సామర్థ్యంతో లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోడానికి రాష్ట్రవ్యాప్తంగా లారీ యజమానులందరూ లారీలను ఆపివేయాలని పిలుపునిచ్చారు.
అయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు…. దీనిపై సరైన స్పష్టత కేవలం భారసకి మాత్రమే ఉందని చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు మద్దతు ఇస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.